త్రిపురలో గెలుపెవరిది ?

15 Feb, 2018 16:39 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : త్రిపుర రాష్ట్ర అసెంబ్లీకి మరో మూడు రోజుల్లో, అంటే ఫిబ్రవరి 18వ తేదీన జరుగనున్న ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 1993 నుంచి ఇప్పటి వరకు, పాతిక సంవత్సరాలపాటు త్రిపుర రాష్ట్రాన్ని పాలిస్తున్న సీపీఎం నాయకత్వంలోని లెఫ్ట్‌ఫ్రంట్‌ మళ్లీ విజయం సాధిస్తుందా? ప్రభుత్వ వ్యతిరేక ఓటును అనుకూలంగా మలుచుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న బీజేపీ విజయం సాధిస్తుందా?

లెఫ్ట్‌ఫ్రంట్‌లో సీపీఎంతోపాటు సీపీఐ, రెవల్యూషనరీ సోషలిస్ట్‌ పార్టీ, అఖిల భారత ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీలు ఉన్నాయి. సైద్ధాంతికంగా వామపక్షాలు, భారతీయ జనతా పార్టీ పరస్పరం విరుద్ధమని, ఇరుపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని తెల్సిందే. అలాంటప్పుడు ఇంతకాలం వామపక్షాలను గెలిపిస్తూ వచ్చిన త్రిపుర ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తారా? అన్న ప్రశ్న రాజకీయ విశ్లేషకులను తొలుస్తోంది. కేంద్రంలో కూడా బీజేపీయే అధికారంలో ఉండడం వల్ల రాష్ట్రంలో కూడా అదే పార్టీకి ఓటు వేయడం వల్ల రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందన్న నమ్మకం ప్రజల్లో కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్‌ పార్టీ అంత బలంగా కనిపించడం లేదు. మొత్తానికి రానున్న ఎన్నికల్లో పాలకపక్ష వామపక్షానికి, బీజేపీకి మధ్యనే రసవత్తరమైన పోటీ జరుగనుంది.

వామపక్షాలు పాతిక సంవత్సరాలపాటు అధికారంలో కొనసాగడానికి కారణం రాష్ట్రంలో రబ్బర్‌ ప్లాంటేషన్‌ను ఎక్కువగా ప్రోత్సహించడం, రైతులకు తగిన గిట్టుబాటు ధర రావడం కారణం. ఇప్పుడు వ్యతిరేకత పెరగడానికి అంతర్జాతీయంగా రబ్బర్‌ ధరలు దారుణంగా పడిపోవడం, పార్టీ కార్యకర్తలకే రబ్బర్‌ తోటల పెంపకానికి రాయితీలు ప్రకటించడం, వారికే సహకరించడం. అంతర్జాతీయంగా గత కొన్నేళ్లుగా  చమురు ధరలు పడిపోవడంతో ఆ చమురు ఉపయోగించి కృత్రిమ రబ్బరును తయారు చేయడం ఎక్కువవడంతో పోటీ తట్టుకోవడం కోసం అసలు రబ్బరు రేట్లు భారీగా తగ్గాయి. రబ్బరు తోటల్లో ఎర్ర జెండాలు తప్ప మరో జెండా కనిపించడానికి వీల్లేదంటూ వామపక్ష నాయకులు రైతులను బెదిరించడం కూడా వారిలో వామపక్షం పట్ల వ్యతిరేకతకు దారితీసిందని విశ్లేషకులు చెబుతున్నారు.

1960 దశకంలో త్రిపుర ప్రజలు ఎక్కువగా పోడు వ్యవసాయంపై ఆధారపడి బతికేవారు. చెట్లను కొట్టేసి, వాటిని తగులబెట్టి, నెలను చదును చేసి రైతులు వ్యవసాయం చేసేవారు. అయినా వారికి నెలవారిగా చూస్తే రెండు, మూడు వేల రూపాయలకు మించి వచ్చేవి కావు. ఆ తర్వాత చెట్లను రక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వం అటవి భూములపై ఆంక్షలు తీసుకురావడంతో రాష్ట్రంలో తిరుగుబాటు ఉద్యమం మొదలైంది. చివరకు అది ప్రత్యేక రాష్ట్రం అవతరణకు దారితీసింది. ఆ తర్వాత కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ రైతులతో పోడు వ్యవసాయాన్ని మాన్పించేందుకు రబ్బర్‌ ప్లాంటేషన్‌ను ప్రోత్సహించింది. అందులో భాగంగా రాష్ట్రస్థాయిలో, కేంద్ర స్థాయిలో రబ్బర్‌ ప్లాంటేషన్‌ బోర్డులను ఏర్పాటు చేసింది.

ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వామపక్షాలు రబ్బర్‌ ప్లాంటేషన్‌ను తీవ్రంగా ప్రోత్సహించింది. రైతులకు అన్ని విధాల సబ్సిడీలను కల్పించి ఆదుకుంది. దాంతో ఒక్కసారి ఒక్కో రైతు ఆదాయం నెలకు 20 నుంచి 30వేల రూపాయలకు పెరిగిపోయింది. రాష్ట్రంలో విద్యను కూడా బాగా ప్రోత్సహించింది. ఫలితంగా రాష్ట్రంలో అక్షరాస్యత శాతం దాదాపు 95 శాతం ఉంది. ఆదాయం పడిపోవడంతో రబ్బర్‌ రైతులు నిరాశతో ఉన్నారు. నిరుద్యోగం కూడా పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో మళ్లీ వామపక్షాలను ప్రజలు ఆదరిస్తారా? అన్నది అనుమానం.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా