ఉత్కంఠ పోరు: మహబలి ఎవరు

17 Mar, 2019 10:05 IST|Sakshi

బరిలో బీజేపీ–శివసేన..

కాంగ్రెస్‌– ఎన్సీపీ కూటమిలు

మహారాష్ట్రలో ఉత్కంఠ పోరు

యూపీ తర్వాత ఎక్కువ లోక్‌సభ సీట్లున్న కీలక రాష్ట్రం మహారాష్ట్ర. కాంగ్రెస్‌కు బలమైన పునాదులున్న ఈ రాష్ట్రంలో చాలా ఆలస్యంగా 1995లో శివసేన–బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఐదేళ్ల తర్వాత కాంగ్రెస్‌–ఎన్సీపీ కూటమి తిరిగి అధికారం చేజిక్కించుకుంది. పదిహేనేళ్ల ఈ కూటమి పాలన ముగిశాక 2014 అక్టోబర్‌లో కాషాయ కూటమి అధికారంలోకి వచ్చింది. 1996 పార్లమెంటు ఎన్నికల్లో మొదటిసారి శివసేన–బీజేపీ కూటమి అత్యధిక సీట్లు (33) కైవసం చేసుకుంది. తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రెండుసార్లు యూపీఏ, రెండు సార్లు ఎన్డీఏ మెజారిటీ సీట్లు గెలుచుకున్నాయి. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ–శివసేన, స్వాభిమాని పక్ష కూటమి 42 స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌–ఎన్సీపీ కూటమి ఆరు సీట్లే దక్కించుకుంది. అదే ఏడాది జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో విభేదాల కారణంగా కాషాయపక్షాలు రెండూ విడివిడిగా పోటీచేశాయి. మెజారిటీ రాకున్నా అత్యధిక సీట్లు (122) సాధించిన బీజేపీ దేవేంద్ర ఫడ్నవిస్‌ నేతృత్వంలో అధికారంలోకి వచ్చింది. 66 సీట్లతో రెండో స్థానం సంపాదించిన శివసేన రెండు నెలల తర్వాత ప్రభుత్వంలో చేరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతున్న శివసేన గత నాలుగేళ్లుగా బీజేపీ, నరేంద్రమోదీ విధానాలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూ చీకాకు పెడుతూనే ఉంది. చివరికి లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు విడుదలకు కొన్ని రోజుల ముందు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా చొరవతో శివసేనతో సీట్ల పంపిణీ ఒప్పందం కుదిరింది. మొత్తం 48 సీట్లలో బీజేపీ 25, శివసేన 23 సీట్లకు కలిసి పోటీచేస్తున్నాయి. యూపీఏ కూటమిలో కాంగ్రెస్‌ 26 సీట్లకు, ఎన్సీపీ 22 సీట్లకు పోటీచేయడానికి ఒప్పందం కుదిరింది. తమ కూటమిలోకి రాజ్‌ ఠాక్రే నాయకత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన(ఎంఎన్‌ఎస్‌)ను కూడా చేర్చుకోవాలని కాంగ్రెస్‌పై ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌ ఒత్తిడి తెచ్చారు. కాంగ్రెస్‌ అందుకు అంగీకరించలేదు.

కాషాయ కూటమికే అత్యధిక సీట్లు?
కేంద్రంలో మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు, రాష్ట్రంలో ఫడణవీస్‌ నాయకత్వంలోని బీజేపీ–సేన సంకీర్ణ ప్రభుత్వం పనితీరుపై జనంలో వ్యతిరేకత పెరగకపోతే కాంగ్రెస్‌–ఎన్సీపీ కూటమికి లోక్‌సభలో ఎక్కువ సీట్లు దక్కే అవకాశాలు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలు కాబట్టి ఇంకా తగ్గని మోదీ జనాకర్షణ శక్తి, పుల్వామా దాడి అనంతర పరిణామాల ప్రభావం వల్ల కాషాయ కూటమికే పాతిక సీట్లు దక్కే వీలుందని రాజకీయ పరిశీలకుల అంచనా. ఇటీవల అసెంబ్లీలో కాంగ్రెస్‌కు చెందిన ప్రతిపక్షనేత రాధాకృష్ణ విఖే పాటిల్‌ కుమారుడు సుజయ్‌ విఖే పాటిల్‌ వంటి నేతలు బీజేపీలోకి ఫిరాయించడం కూడా కాంగ్రెస్‌ కూటమికి పెద్ద దెబ్బగా పరగణించవచ్చు. అహ్మద్‌నగర్‌లో బీజేపీ టికెట్‌పై పోటీచేసే తన కొడుకు సుజయ్‌కు వ్యతిరేకంగా తాను ప్రచారం చేయబోనని కూడా రాధాకృష్ణ ప్రకటించారు.

బీజేపీకి దూరమైన రాజూ షెట్టి పార్టీ  
కిందటి ఎన్నికల్లో కాషాయ కూటమితో కలిసి పోటీచేసి గెలిచిన షేట్కారీ స్వాభిమానీ సంఘటన్‌ నేత రాజూ షెట్టి ఎన్డీఏకు దూరమయ్యారు. రైతాంగంలో మంచి బలమున్న ఈ పార్టీ ఎన్డీఏలో ఉంటే బీజేపీకి ప్రయోజనం ఉండేది. ఒంటరిగా పోటీచేస్తున్న షెట్టికి హట్కంగ్లే స్థానంలో మద్దతు ఇస్తామని శరద్‌పవార్‌ ప్రకటించారు. బీజేపీ మద్దతుతో రాజ్యసభకు ఎన్నికైన మహారాష్ట్ర స్వాభిమాన్‌ పక్ష నేత, మాజీ సీఎం నారాయణ్‌ రాణే కూడా తమకు సీట్లు కేటాయించకపోవడంపై అసంతృప్తితో ఉన్నారు. కేంద్రమంత్రి, ఆర్పీఐ నాయకుడు రాందాస్‌ అఠావలే కూడా తమను సీట్ల సర్దుబాటు చర్చలకు పిలవలేదని ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. ఎంఐఎంతో పొత్తు ఉన్న భారిప బహుజన్‌ మహాసంఘ్‌ నేత, బీఆర్‌ అంబేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌తో సీట్ల సర్దుబాటుకు కాంగ్రెస్‌ జరిపిన చర్చలు ముందుకు సాగలేదు. ఫలితంగా రాష్ట్రంలో కొన్ని స్థానాల్లో చతుర్ముఖ పోటీ తప్పదని భావిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తి
ఫడ్నవిస్‌ కేబినెట్‌లోని పంకజా ముండే వంటి కొందరు మంత్రులపై అవినీతి ఆరోపణలతో పాటు వ్యవసాయ రంగంలో సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం వంటి సమస్యలు పాలక కూటమిని ఎన్నికల్లో ఇబ్బంది పెట్టే అంశాలు. మహారాష్ట్ర నుంచి రాజధాని ముంబైకి ప్రదర్శనతో వచ్చిన వేలాది మంది కరువు ప్రాంత డిమాండ్లకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందులు తొలగిపోలేదు. కిందటేడాది భండారా–గోండియా లోక్‌సభ సీటుకు జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ ఓటమి రైతుల ఆగ్రహానికి అద్దంపట్టింది. అంతేగాక ఈ ఉప ఎన్నికల్లో భాగస్వామ్యపక్షం శివసేనతో పొత్తు కుదరలేదు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో రెండు కాషాయపక్షాలూ పరస్పర సహకారంతో పనిచేస్తే తప్ప రాష్ట్రంలో అవి కిందటి ఎన్నికల్లో మాదిరిగా అత్యధిక సీట్లు గెలుచుకోవడం కష్టమే.


దేవేంద్ర ఫడణవీస్‌: ఫరవాలేదా?
44 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి అయిన ఫడణవీస్‌ నాగపూర్‌కు చెందిన ఆరెసెస్‌ మూలాలున్న బీజేపీ నేత. నగర మేయర్‌గా, నాలుగుసార్లు నగర శాసనసభ్యునిగా పనిచేశారు. సాధారణంగా వ్యవసాయ సామాజికవర్గమైన మరాఠా నేతలకే రాష్ట్రంలో సీఎం పదవి ఎక్కువసార్లు కట్టబెట్టడం ఆనవాయితీ. ఈ సంప్రదాయనికి భిన్నంగా బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఫడణవీస్‌కు సీఎం పీఠం దక్కడం మోదీ–అమిత్‌ షా ద్వయం నిర్ణయంతోనే సాధ్యమైంది. సంఖ్యాబలం లేని సామాజికవర్గానికి చెందినప్పటికీ ఆరెసెస్‌ మద్దతు, పార్టీ కేంద్ర నాయకత్వం సహకారంతో రాష్ట్రంలో పరిపాలన ఫరవాలేదనిపించేలా ఆయన చేయగలిగారు. పార్లమెంటు ఎన్నికల్లో పాలక కూటమికి కనీసం సగం సీట్లయినా రాకపోతే ఆయన పదవికి ఇబ్బందే.

పవార్‌: తెస్తారా పవర్‌?
రాజకీయంగా, ఆర్థికంగా ఇంకా అన్ని విధాలా బలవంతుడైన మరాఠా నేతగా దేశ ప్రజలందరికీ సుపరిచితుడు శరద్‌ పవార్‌. 37 ఏళ్ల వయసులోనే ఆయన తన పార్టీని (కాంగ్రెస్‌–ఎస్‌) చీల్చి జనతా పార్టీతో చేతులు కలిపి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. తర్వాత ఆయన కాంగ్రెస్‌లో చేరి మరో రెండుసార్లు సీఎం అయ్యారు. 1991 లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రధాని పదవి కోసం ఆయన పీవీతో పోటీపడినా వెనక్కి తగ్గక తప్పలేదు. ముఖ్యమంత్రిగా, కేంద్ర వ్యవసాయమంత్రిగా పాలనా సామర్ధ్యం ఉన్న నేతగా నిరూపించుకున్నారు. 1999లో కాంగ్రెస్‌ నాయకురాలు సోనియా విదేశీ మూలాల సమస్య లేవనెత్తి ఎన్సీపీ స్థాపించారు. మరాఠాలు, సహకార చక్కెర ఫ్యాక్టరీలు ఎక్కువ ఉన్న పశ్చిమ మహారాష్ట్రలో పవార్‌ పలుకుబడి ఎక్కువ.  రాష్ట్రంలో తన పార్టీని దాదాపు పది సీట్లలో గెలిపించే సామర్థ్యం పవార్‌కు ఉంది.

నితిన్‌ గడ్కరీ: పనిచేసేనా పలుకుబడి?
పరిపాలనాదక్షునిగా మంచి పేరు సంపాదించిన కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, నౌకాయాన శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సంచలన ప్రకటనలు చేసే బీజేపీ నేతగా తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. బీజేపీకి రాబోయే ఎన్నికల్లో మెజారిటీ రాకుంటే అన్ని పక్షాలతో సత్సంబంధాలున్న గడ్కరీకే కేంద్రంలో సంకీర్ణ సర్కారును నడిపే అవకాశమిస్తారనే ఊహాగానాలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఫడ్నవిస్‌ మాదిరిగానే నాగపూర్‌కు, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన గడ్కరీ బీజేపీ జాతీయ అధ్యక్షునిగా మూడేళ్లు పనిచేసిన అనుభవం ఉంది. విదర్భ ప్రాంతంలో బీజేపీ–సేన కూటమి విజయానికి గడ్కరీ పలుకుబడి కొంత వరకు ఉపయోగపడుతుంది.

మరిన్ని వార్తలు