సీఎం ఎవరు?

12 Dec, 2018 05:37 IST|Sakshi
రాయ్‌పూర్‌లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద ఆ పార్టీ శ్రేణుల సంబరాలు

స్వయంవరంలో పోటీపడనున్న నలుగురు ఆశావహులు

రేసులో బాగెల్, సింగ్‌దేవ్, తమ్రద్‌వాజ్‌ సాహూ, చరణ్‌దాస్‌ మహంత్‌

ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ 15 ఏళ్ల తరువాత అధికారం దక్కించుకోవడంతో ఇప్పుడు అందరి దృష్టి సీఎం అభ్యర్థి ఎవరనే దానిపైనే ఉంది. ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు భూపేశ్‌ బాగెల్‌ సీఎం అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మరో ముగ్గురు కూడా పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. పటన్‌ స్థానం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికైన భూపేష్‌ బాగెల్‌.. 1980లలో యువజన కాంగ్రెస్‌ సభ్యునిగా రాజకీయాల్లోకి వచ్చారు. దిగ్విజయ్‌ సింగ్‌ ప్రభుత్వం (ఉమ్మడి మధ్యప్రదేశ్‌)లో మంత్రిగా పనిచేశారు.

ఎంపీ నుంచి ఛత్తీస్‌గఢ్‌ విడిపోయిన తర్వాత ఏర్పడిన అజిత్‌ జోగి ప్రభుత్వంలో మంత్రిగా విధులు నిర్వర్తించారు. 2013లో మహేంద్రకర్మ అనే మాజీ మంత్రిని హత్య చేసేందుకు మావోయిస్టులు జరిపిన దాడిలో (ఇందులో కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది) ప్రాణాలతో బయటపడిన భూపేశ్‌.. ఆ తరువాత పార్టీ నిర్మాణంలో తనదైన పాత్ర పోషించడం ద్వారా మంచి పేరు సంపాదించుకున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా పనిచేసిన టీఎస్‌ సింగ్‌దేవ్‌ కూడా సీఎం రేసులో ఉన్నారు.

ఈయన కాంగ్రెస్‌ పార్టీ ధనిక అభ్యర్థుల్లో ఒకరు.  సీతాస్వయంవరం తరహాలో  సీఎం ఎంపిక జరగాలనేది ఈయన అభిప్రాయం. ఆ స్వయంవరంలో పాల్గొని పదవిని వరించాలని తహతహలాడుతున్నారు. లౌక్యమున్న నేతగా పేరున్న సింగ్‌దేవ్‌ అంబికాపూర్‌ నుంచి గెలుపొందారు. ఓబీసీ నేత తమ్రద్‌వాజ్‌ సాహూ కూడా బాగెల్, సింగ్‌దేవ్‌లకు పోటీనిస్తున్నారు. కుల సమీకరణల నేపథ్యంలో.. సాహూకు అవకాశం వస్తే రావచ్చు. ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రయోజనం పొందవచ్చేనేది కాంగ్రెస్‌ ఆలోచన. సీఎం రేసులో ఉన్న నాలుగో వ్యక్తి శక్తి నియోజకవర్గం నుంచి గెలుపొందిన చరణ్‌ దాస్‌ మహంత్‌. ఈయన దిగ్విజయ్‌ సింగ్‌ మంత్రివర్గంలో మంత్రిగా, కేంద్రంలో మన్మోహన్‌ సింగ్‌ కేబినెట్‌లో సహాయ మంత్రిగా పని చేశారు.    

మరిన్ని వార్తలు