‘ఆ మొత్తం బాబు ఆస్తులు అటాచ్‌ చేసి రాబట్టాలి’

3 Feb, 2020 19:54 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రజల బాగుకోసం ఆలోచించని చంద్రబాబు.. జాతీయ మీడియా దృష్టిలో పడేందుకు తెగ తాపత్రయ పడుతున్నారని రవాణా, సమాచార మంత్రి పేర్ని నాని (వెంకటరామయ్య) అన్నారు. బాబు ఇక జీవితంలో మారడని సోమవారం నాటి ప్రెస్‌ మీట్‌ చూస్తే తెలుస్తోందని పేర్కొన్నారు.  జాతీయ మీడియాలో ఎవరెవరో ఏదేదో అన్నారంటూ తోక పత్రిక మాదిరిగా ఏరుకు వచ్చిన వార్తల్ని చదివి వినిపించారని విమర్శించారు. మన రాష్ట్ర సమస్యలపై అవగాహన లేని వారు, బాబు మేనేజ్‌ చేస్తే మాట్లాడిన మాటల్ని అందంగా ప్రదర్శించారని ఎద్దేవా చేశారు.  రేవంత్‌రెడ్డి డబ్బుల మూట విజువల్స్, తన బ్రీఫ్డ్‌ మీ ఆడియో కూడా చంద్రబాబు అందరికీ చూపిస్తే బాగుండేదని మంత్రి చురకలంటించారు. ఈమేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

ఛాంపియన్‌ అయితే ఏం చేశావ్‌..!
‘అభివృద్ధికి బాబే ఛాంపియన్‌ అయితే... ఏపీ ప్రజలు ఎందుకు ఉతికి ఆరేశారు? సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దాదాపు 90 శాతం కుటుంబాలకు సంతోషాన్నిస్తుంటే చంద్రబాబుకు ఇక్కడి ప్రజల మనోభావాలతో పని లేదు. మన రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టుపెట్టి వేరే దేశాల ప్రయోజనాలకు ఏ మాత్రం దెబ్బతగిలినా తట్టుకోలేని సున్నితమైన మనిషి ఆయన! 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్నది ఘోరమైన ఆలోచన అని కూడా బాబు చెప్పారు.

ఈయేడాది దావోస్‌లో స్విస్‌ బ్యాంకు అకౌంట్లు సరి చూసుకునేందుకు అవకాశం లేకపోయిందని ఆయన బాధపడుతున్నారా అన్నది కూడా తేలాలి. మూడు ప్రాంతాలకూ ఎందుకు అన్యాయం చేశావంటే మాట్లాడడు. అమరావతిలో అయిదేళ్లలో ఏం కట్టారంటే మాట్లాడరు. మూడు ప్రాంతాలకూ మీరు చేసిన వాగ్దానాలు ఎందుకు అమలు కాలేదంటే మాట్లాడరు. మీరు అమరావతిని అభివృద్ధి చేస్తే తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో ఎందుకు ఓడారంటే మాట్లాడరు. కనీసం ల్యాండ్‌ పూలింగ్‌ ఏరియాలో డ్రైనేజీ వేయగలిగారా అంటే నోరెత్తరు.

నోరెందుకు మెదపవు..!
హైదరాబాద్‌ తొమ్మిదేళ్లలో నేనే డెవలప్‌ చేశానంటున్న మనిషి, అయిదేళ్లలో మోదీగారి శంకుస్థాపన రాయి దగ్గర పిచ్చి మొక్కలు మాత్రమే ఎందుకు మిగిలాయంటే ఆయన నోరు పెగలటం లేదు.  రోడ్లు లేవు, నీటి పైపులు లేవు. కరెంటు లైన్లు లేవు, ప్లాట్లు డెవలప్‌ చేయలేదు, రైతులకు ప్లాట్లు ఇవ్వకుండానే  2000 ఎకరాలు అమ్మేశారు. శ్రీబాగ్‌ ఒప్పందం అమలు చేయటం అవసరం అని సీఎం వైఎస్‌ జగన్‌ అంటే రాయలసీమలో పుట్టి కూడా ఆ ఒప్పందాన్ని బాబు వ్యతిరేకిస్తారు.

విశాఖలో సెక్రటేరియట్‌ పెడతాం అంటే కాదూ కూడదంటారు... మరి ఉత్తరాంధ్రకు ఎలా న్యాయం చేయగలుగుతాం? అభివృద్ధి చెందిన నగరంలో రాజధాని ఉంటే మౌలిక సదుపాయాలకు భారీగా పెట్టుబడుల అవసరం ఉండవని శంఖం ఊదుతున్నా ఆయనకు వినిపించటం లేదు. పెట్టుబడిదారుల్ని బెదరగొట్టేలా చంద్రబాబు కరప్షన్‌ అంతర్జాతీయ స్థాయికి చేరిందని ఆయన సీఎంగా ఉండగానే జపాన్‌ సంస్థ మాకీ అసోసియేట్స్‌ పెద్ద ఉత్తరం రాసి మరీ ఛీ కొట్టింది. ఇంతకీ మీ బినామీ భూముల కోసమే ఆ మూడు గ్రామాల ఉద్యమం అవునా కాదా అంటే చంద్రబాబు సమాధానం ఇవ్వటం లేదు.

ఆయనవన్నీ అబద్ధాలే..!
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, గోదావరి–కృష్ణ అనుసంధానం చేయాలా వద్దా... ఇలాంటి అనేక ప్రాజెక్టులకు డబ్బెక్కడినుంచి తీసుకురావాలి? చంద్రబాబు బినామీలు, ఆయన మిత్రులు, సహచరుల బినామీ భూముల రేట్లు రూ.2 కోట్ల నుంచి 20 కోట్లు పెంచుకోవటం కోసం ఇక్కడే రూ.1.10 లక్షల కోట్లు అప్పు చేసి మరీ పెట్టుబడి పెట్టాలా అంటే సమాధానంగా చెప్పేవన్నీ అబద్ధాలే. తన హయాంలో అమరావతికి చేసిన ఖర్చు రూ.5,600 కోట్లు మాత్రమే అయితే మిగతాది ఎక్కడినుంచి తేవాలంటే దానికీ సమాధానం లేదు. 

గత చీఫ్‌ సెక్రెటరీగారి విషయంలో చంద్రబాబు దిగజారి మాట్లాడారు. ఇదే విజయవాడలో హత్యకు గురైన ఐఏఎస్‌ రాఘవేంద్రరావు, జర్నలిస్టు పింగళి దశరథరామ్, నాయకుడు వంగవీటి రంగాల హత్యలకు తాము పన్నిన డిజైన్లు చంద్రబాబుకు గుర్తు వచ్చి ఉంటాయి. కోర్టును ధిక్కరించి ఎలాంటి జీవోలూ జారీ చేయలేదు. బీ కేర్‌ఫుల్‌ అంటూ చంద్రబాబు హుంకరిస్తుంటే ఆయనకు మతి చెలించిందని అర్థమవుతోంది.  ప్రజావేదిక ఏం పాపం చేసిందని బాబు అమాయకంగా అడిగారు. నదిలో కట్టకూడదన్న జ్ఞానం ఆయనకు ఇప్పటికి కూడా రాలేదని అర్థమవుతోంది. అలాంటి కట్టడం కట్టినందుకు మొత్తం సొమ్ము చంద్రబాబు ఆస్తులు అటాచ్‌ చేసి రాబట్టాలి.

మరిన్ని వార్తలు