చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత ఎందుకు?

7 Oct, 2017 19:51 IST|Sakshi

సాక్షి, హుస్నాబాద్ : సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల్లో తెరాస అనుభంద యూనియన్‌ టీబీజీకేఎస్‌ గెలుపొందడంతో కేసీఆర్‌కు అహంకారం తలకెక్కి సహానం కోల్పోయి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవినే దిగజార్చారని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ తీవ్రంగా విమర్శించారు. వందల కోట్లు ఖర్చు పెట్టి స్వల్ప ఆధిక్యంతో సింగరేణి ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినట్లుగా ఊగిపోవడం ఆయనకే చెల్లిందని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కార్మికులు, కార్మిక శాఖ, సింగరేణి యాజమాన్యం నిర్వహించుకోవాల్సిన ఎన్నికల్లో కేసీఆర్‌ ప్రభుత్వం అధికార యంత్రాగాన్ని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను గనుల ఏరియాల్లో తింపి ఎడాపెడా వాగ్ధానాలతో గెలిచిందసలు గెలుపే కాదని అన్నారు. కేసీఆర్‌ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో సింగరేణి కార్మికులకు లాభాలు ఏమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను అవమానపరిచి, ప్రొఫెసర్‌ జయశంకర్, ప్రోఫెసర్‌ కొదండరాం ఆలోచన విధానంతో కదిలిన కేసీఆర్, సోనియా గాంధీ దయతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాక గౌరవ పెద్దలను అవమానించడం క్షమించరాదని పొన్నం ప్రభాకర్‌ దుయ్యబట్టారు.

కుర్చీ పై కూర్చున్న నీకు నీ కుటుంబ సభ్యులు తప్పా, ఇంకెవరి త్యాగాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రధాని నెహ్రూ తెలంగాణ వర ప్రదాయిని శ్రీరాం సాగర్, నాగార్జునసాగర్‌ భారీ ప్రాజెక్టులను ప్రారంభించి, ఇందిరా గాంధీ హాయంలో పూర్తి చేయడం వల్లనే బీడు వారిన తెలంగాణ నేడు సస్యశ్యామలమైందని అన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుకు కేంద్ర అనుమతులు సాధించి ప్రారంభించారని చెప్పారు. అలా నిర్మాణంలో ఉన్న దాని గురించి వక్ర భాష్యాలు చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చడం వల్లనే నేడు కేంద్రంలోని అనుమతులు ఆగిపోయాయన్నారు.

తెలంగాణలోని ఎంతో మంది సినీ తారలను అవమానించి తమిళనాడుకు చెందిన సినీ నటి సమంతను రాష్ట్ర చేనేత వస్త్రాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించడం వెనుక ఆంతర్యమేమిటో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో పెట్టిన హామీలైన రెండు పడకల గదులు, దళితులకు మూడెకరాల భూమి, యాదవ సోదరులకు ఎన్ని వేల గొర్రెలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌లతో ఎంత మంది లభ్ది పొందారో, కాంగ్రెస్‌ పార్టీ ప్రారంభించిన ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని పొన్నం డిమాండ్‌ చేశారు. దమ్ము, దైర్యం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు సిద్దపడాలని అన్నారు.

మరిన్ని వార్తలు