బాబు ఎందుకు భయపడుతున్నారు?

27 May, 2018 12:18 IST|Sakshi

సాక్షి, అమరావతి : టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేసిన తీవ్ర వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రమణ దీక్షితుల్ని అవమానించేవిధంగా సోమిరెడ్డి చేసిన పరుష వ్యాఖ్యలపై తాజాగా బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ట్విటర్‌లో స్పందించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) సంబంధించిన అంశాలను ప్రస్తావించిన రమణ దీక్షితుల్ని జైల్లో వేస్తామని బెదిరించడం దేనికి సంకేతమని జీవీఎల్‌ ప్రశ్నించారు. రమణ దీక్షితులు లేవనెత్తిన విషయాల్లో చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. రమణ దీక్షితుల్ని ఉద్దేశించి ‘జైల్లో వేసి నాలుగు తగిలించాలి’ అంటూ సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలను జీవీఎల్‌ తీవ్రంగా ఖండించారు.

చంద్రబాబు దక్షిణాది అసహన సుల్తాన్‌గా మారిపోయారని మండిపడ్డారు. టీటీడీ బోర్డులో హిందువేతరుల్ని నియమించారని తప్పుబట్టారు. తిరుమల వెంకన్న ఆలయంలో జరుగుతున్న వ్యవహారాలపై ఆందోళన వ్యక్తం చేసినందుకు మొదట రమణ దీక్షితుల్ని ప్రధాన అర్చకుడిగా పదవి నుంచి తొలగించారని, ఇప్పుడు జైల్లో వేస్తామని భయపెడుతున్నారని విమర్శించారు. రమణ దీక్షితులుకు సోమిరెడ్డి క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయనను మంత్రిపదవి నుంచి తొలగించాలని జీవీఎల్‌ నరసింహారావు డిమాండ్‌ చేశారు. రమణ దీక్షితులుపై సోమిరెడ్డి వ్యాఖ్యలను బీజేపీ నేత ఆంజనేయరెడ్డి కూడా తప్పుబట్టారు. మంత్రులు కూడా చంద్రబాబు తరహాలోనే ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.

జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి!
గుంటూరు : టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై మంత్రి సోమిరెడ్డి  చంద్రమోహన్‌రెడ్డి చేసిన పరుష వ్యాఖ్యలపై బ్రాహ్మణ సేవాసంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమిరెడ్డి వెంటనే బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది. రమణ దీక్షితులుపై సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలని, లేదంటే తిరుమలలో ఆందోళన చేపడతామని బ్రాహ్మణ సేవాసంఘం హెచ్చరించింది. జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది. టీడీపీ కుల,  మతపరమైన రాజకీయాలు చేయడం దారుణమని మండిపడింది.

మరిన్ని వార్తలు