చంద్రబాబు ఎందుకు ముందుకు రావడం లేదు?

19 Feb, 2018 17:01 IST|Sakshi

సాక్షి, విజయవాడ : అవిశ్వాసం పెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నా చంద్రబాబు నాయుడు ముందుకు రావడం లేదని వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఆయన సోమవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘ చంద్రబాబు అవిశ్వాసానికి ఎందుకు సహకరించరు. నరేంద్ర మోదీ అంటే చంద్రబాబుకు ఎందుకంత భయం. బీజేపీ మంత్రులు రాజీనామా చేస్తామంటే కేంద్రంలోని మా మంత్రులు రాజీనామా చేయరని చంద్రబాబు అంటున్నారు. మాకు చట్టాలు తెలియవని చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రతిపక్షంగా విప్‌ జారీ చేసి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడిన ఘటన చంద్రబాబుదే. అలాంటి చట్టాలన్నీ చంద్రబాబుకే తెలుసు. మాకు తెలిసిన చట్టం ప్రకారం అవిశ్వాసానికి 50మంది ఎంపీలు కావాలి. మీరు కలిసి రండి అంటే..చంద్రబాబు కుదురదు అంటున్నారు.

నాలుగేళ్లు కాలయాపన చేశారు. ఇప్పుడు అఖిలపక్షం అంటున్నారు. అఖిలపక్షంతో ఒరిగేదేంటి?. అఖిలపక్షం అంటూ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని కేంద్రం నుంచి తీసుకున్నారు. మరి ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌ పూర్తి చేయడానికి నిధులు ఎక్కడవి?. చంద్రబాబు ప్రతిదానికి జగన్‌ని ముడిపెట్టడం దారుణం. చేతనైతే పోలవరం పూర్తిచేయాలి. మాపై నిందలు మానుకుంటే మంచిది. ఏపీ బీజేపీనేతలు చంద్రబాబు మంత్రివర్గంలో ఉండం అని ఖరాఖండిగా చెబుతున్నా చంద్రబాబు మాత్రం ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. గత ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి మాదిరిగా చంద్రబాబు కూడా ప్రజలను మభ్యపెడుతున్నారు. ఏపీకి ప్రస్తుతం కావాల్సింది ప్రత్యేక హోదానే. హోదా విషయంలో మేం రాజీపడే ప్రసక్తేలేదు?’ అని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు