ప్రియాంక.. అందుకే వెళ్లలేదా?

22 Oct, 2019 15:39 IST|Sakshi

న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీకి భంగపాటు తప్పదని ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించాయి. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్‌ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. అయితే కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మహారాష్ట్ర, హరియాణ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆమె ఎందుకు ప్రచారం చేయలేదన్న ప్రశ్న ఉత్పమన్నమవుతోంది. ఉత్తరప్రదేశ్‌లో పార్టీని బలోపేతం చేయడంపైనే ప్రధానంగా ఆమె దృష్టి పెట్టారని కాంగ్రెస్‌ నాయకుడొకరు వెల్లడించారు. ‘ఆమె(ప్రియాంక గాంధీ) ప్రధానంగా ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పునర్‌నిర్మాణం, పునరుద్ధరణపై దృష్టి సారించార’ని ఆయన పేర్కొన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక ప్రచారం చేసినా యూపీలో కాంగ్రెస్‌ పార్టీకి లాభం చేకూరలేదు. తమ కుటుంబానికి పెట్టని కోటగా ఉన్న అమేథీ స్థానం నుంచి పోటీ చేసిన రాహుల్‌ గాంధీ 50 వేలకు పైగా ఓట్ల తేడాతో బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ చేతిలో పరాజయం చవిచూడాల్సి వచ్చింది. రాయబరేలి నుంచి సోనియా గాంధీ విజయం సాధించగలిగారు. యూపీలో కాంగ్రెస్‌కు ఉన్న లోక్‌సభ సీటు ఇదొక్కటే కావడం గమనార్హం.

జనవరి 23న అధికారికంగా క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా యూపీతో పాటు గుజరాత్‌, అసోం, పంజాబ్‌, హరియాణా, కేరళ రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించారు. చివరి అస్త్రంగా ప్రియాంకను ప్రయోగించేందుకే ఆమెను అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్‌ పంపలేదని హరియణాకు చెందిన రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్‌ రాజేంద్ర శర్మ అభిప్రాయపడ్డారు. కాగా, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా మహారాష్ట్ర, హరియణా శాసనసభా ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లలేదు. రాహుల్‌ గాంధీ ఒక్కరే ప్రచారం చేశారు. మహారాష్ట్రలో 6, హరియాణాలో 2 ఎన్నికల సభల్లో ఆయన పాల్గొన్నారు. (చదవండి: అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు)

Poll
Loading...
మరిన్ని వార్తలు