సోనియా పర్యటనపై అనుమానాలు

23 Nov, 2018 02:43 IST|Sakshi

ఒక్క తెలంగాణలోనే పర్యటన ఎందుకు?: ఇంద్రసేనారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ తెలంగాణ పర్యటన అనేక అనుమానాలకు తావిస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేయని సోనియా తెలంగాణలోనే పర్యటించడం వెనుక ఆంతర్యం ఏమిటన్నారు. సోనియా పర్యటిస్తున్న మేడ్చల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి సామా సతీశ్‌పై అనేక ఆరోపణలు ఉన్నాయన్నారు.

ఇటీవల లంచం కేసులో ఆయన పేరు ప్రముఖంగా వినిపించిందన్నారు. ఈడీ నమోదు చేసిన అభియోగ పత్రంలో సామా సతీష్, షబ్బీర్‌ అలీల పేర్లు ఉన్నాయన్నారు. ఈ అవినీతి నెట్‌వర్క్‌కి, టెన్‌ జన్‌ప«థ్‌కి ఉన్న సంబంధం ఏమిటని ప్రశ్నించారు. గిరిజన, మైనార్టీ రిజర్వేషన్లపై టీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. కేసీఆర్‌కు ఓడిపోతాననే భయం పట్టుకుందని, దీంతో చలిజ్వరం వచ్చిందన్నారు. దీనికి విరుగుడుగా రాష్ట్ర ప్రజలు డిసెంబర్‌ 7న జరిగే ఎన్నికల్లో కర్రుకాల్చి వాతపెడతారన్నారు. 

మరిన్ని వార్తలు