రేవంత్‌ బాంబ్‌: ఆత్మరక్షణలో టీడీపీ!

20 Oct, 2017 09:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రేవంత్‌ రెడ్డి వ్యవహారం టీడీపీ అధినాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న రేవంత్‌ రెడ్డి.. పార్టీ అధినాయకత్వం, ముఖ్యంగా ఏపీ మంత్రులు, ఏపీ టీడీపీ నేతలు లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్‌ టార్గెట్‌గా.. తీవ్ర విమర్శలు గుప్పించారు.

రేవంత్‌రెడ్డి కదలికలు.. ఆయన చేసిన ఆరోపణలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నా.. ఈ వ్యవహారంపై టీడీపీ అధినాయకత్వం మాత్రం వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తోంది. ఇటు పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుగానీ, అటు చంద్రబాబు తనయుడు, ఏపీ మంత్రి లోకేశ్‌గానీ ఈ వ్యవహారంలో మౌనపాత్ర పోషిస్తున్నారు. ఉలుకు-పలుకు లేకుండా జరుగుతున్న పరిణామాల్ని నిశితంగా గమనిస్తున్నారు. అటు ఏపీ మంత్రులు యనమల, పరిటాల సునీత సైతం తమపై రేవంత్‌రెడ్డి గుప్పించిన ఆరోపణలపై నోరుమెదపడం లేదు. రేవంత్‌ ఆరోపణలు దుమారం రేపుతున్నా.. టీడీపీ అధినేత, ఇతర నేతల మౌనం రాజకీయ పరిశీలకుల్ని విస్మయ పరుస్తోంది.

ఎందుకీ మౌనం.. అసలు మర్మమేమిటి?
తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా కుదిపేసిన ఓటుకు కోట్లు కేసులో కీలక నిందితుడు రేవంత్‌రెడ్డి. ఆంగ్లో-ఇండియన్‌ నామినేటెడ్‌ ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయిన కేసులో ఆయన జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఈ కేసుకు సంబంధించిన సమస్త సమాచారం ఆయన వద్ద ఉందని తెలుస్తోంది. ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో ప్రధాన సూత్రధారి చంద్రబాబే అన్న ఆరోపణలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్‌ తాజాగా చేసిన ఆరోపణలపై ప్రతిస్పందించినా.. ఆయనపై ఎదురుదాడి చేసినా.. ఈ కేసులో అసలు బండారం ఆయన బయటపెట్టే అవకాశం లేకపోలేదన్న అనుమానం ఏపీ టీడీపీ నేతలను వెంటాడుతూ ఉండొచ్చునని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీ టీడీపీ నేతలు సైతం ఓటుకు కోట్ల కేసు కారణంగానే రేవంత్‌పై పార్టీ అధిష్టానం సైలెంట్‌గా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

రేవంత్‌ వ్యవహారంలో టీడీపీ అధినాయకత్వం పూర్తి ఆత్మరక్షణ ధోరణిలో ఉందని, ఆయనపై ఎలాంటి ఎదురుదాడి, విమర్శలు చేసినా.. ఓటుకు కోట్ల కేసులో అది ఎదురుతన్నే అవకాశముందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే ప్రస్తుతానికి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు సైతం రేవంత్‌ వ్యవహారంలో గప్‌చుప్‌గా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. రేవంత్‌ ఆరోపణలపై స్పందించాల్సిందిగా తాజాగా మంత్రి దేవినేని ఉమాను కోరినా.. ఆయన సమాధానం దాటవేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి రేవంత్‌ వ్యవహారంలో టీడీపీ అధినాయకత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది.  ఓటుకు కోట్లు కేసు ఆందోళన టీడీపీ నాయకత్వంలో ఉండటమే ఇందుకు కారణమని పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది.
 

మరిన్ని వార్తలు