ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ మునక..?

25 May, 2019 15:11 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. చత్తీస్‌గఢ్‌లో ఒక్క సీటును, మధ్యప్రదేశ్‌లో రెండు సీట్లను అతి కష్టం మీద దక్కించుకోగలిగింది. ఆ తర్వాత, అంటే 2018లో ఈ మూడు హిందీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా పాలకపక్ష బీజేపీని ఓడించి అధికారంలోకి రాగలగింది. దాంతో మళ్లీ కాంగ్రెస్‌ పార్టీలో కొత్త ఆశలు చిగురించాయి. ఈసారి ఈ మూడు రాష్ట్రాల్లోని 65 లోక్‌సభ సీట్లకు జరిగిన ఎన్నికల్లో కనీసం సగం సీట్లు దక్కించుకోవచ్చని ఆశపడింది. రాష్ట్ర ప్రభుత్వాల అండతో ఆ దిశగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. అయినా ఏ మాత్రం మెరుగైన ఫలితాలను సాధించలేక పోయింది. 

ఈ మూడు రాష్ట్రాల్లో కలిసి 2014లో మూడు సీట్లే రాగా, ఇప్పుడు మూడు సీట్లే వచ్చాయి. గత ఎన్నికల్లోలాగే ఈ ఎన్నికల్లో కూడా రాజస్థాన్‌లో ఒక్క సీటంటే ఒక్క సీటు రాలేదు. చత్తీస్‌గఢ్‌లో గతంలో ఒక్క సీటు రాగా ఈ సారి రెండు సీట్లు వచ్చాయి. మధ్యప్రదేశ్‌లో గతంలో రెండు సీట్లు రాగా, ఈ సారి ఒక్క సీటు వచ్చింది. పుండు మీద కారం చల్లినట్లుగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మహామహులు ఓడిపోయారు. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా, దిగ్విజయ్‌ సింగ్, అజయ్‌ సింగ్, వివేక్‌ టన్ఖా, కాంతిలాల్‌ భురియా, అరుణ్‌ యాదవ్‌లు ఓడిపోయారు. ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ కుమారుడు నకుల్‌ నాథ్‌ తన తండ్రి ఎంపీ నియోజకవర్గమైన ఛింద్వారా నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే అది కూడా తక్కువ మెజారిటీతోనే. 

ఇక రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ కుమారుడు వైభవ్‌ కూడా ఓడి పోయారు. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాధిత్య సింధియాను, రాజస్థాన్‌లో సచిన్‌ పైలట్‌ను ముఖ్యమంత్రులను చేయాలని గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం యువ కాంగ్రెస్‌ నాయకుల నుంచి డిమాండ్‌ వచ్చింది. అయితే ఈ లోక్‌సభ ఎన్నికల్లో పలు ఎంపీ సీట్లను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉన్నందున సీనియర్లకు నాయకత్వం అప్పగించక తప్పడం లేదని నాడు కాంగ్రెస్‌ అధిష్టానం వాదించింది. మరి ఇప్పుడు ఏమైందీ ? ఎందుకు ఈ ఘోర పరాజయం ఎదురైందీ? 

కొంప ముంచిన అతి విశ్వాసం 
ఈ మూడు రాష్ట్రాల్లో పార్టీ ఓటమికి మొట్టమొదటి కారణం అతి విశ్వాసం కాగా, రెండో కారణం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేయలేకపోవడం, మూడో కారణం. నరేంద్ర మోదీ ఫ్యాక్టర్‌. 11 సీట్లలో ఎనిమిది సీట్లలో క్షేత్రస్థాయి పరిస్థితులను పట్టించుకోకుండా కచ్చితంగా గెలుస్తామన్న అతి విశ్వాసంతో ఎన్నికల ప్రచారం కూడా సరిగ్గా చేయలేదని, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఓట్లు వేయక ఏం చేస్తారన్న భరోసా కొంపముంచిందని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని చత్తీస్‌ గఢ్‌ సీనియర్‌ పార్టీ నాయకుడొకరు తెలిపారు. పైగా అన్ని వర్గాల ఓటర్లను ఆకర్షించడానికి బీజేపీ తీవ్రస్థాయిలో ప్రచారం చేసిందని చెప్పారు. మధ్యప్రదేశ్‌లో కూడా ఎలాగైన సగం సీట్లు గెలుస్తామన్న ధీమానే కాంగ్రెస్‌ పార్టీని దెబ్బతీసింది. అతి విశ్వాసంతోనే దిగ్విజయ్‌ సింగ్‌ తన సొంత నియోజకవర్గమైన రఘోగఢ్‌ వదిలేసి భోపాల్‌ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆయన రఘోగఢ్‌ నుంచి పోటీచేసి ఉంటే ఆ సీటైనా దక్కేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఇక రాజస్థాన్‌ విషయంలో ఎంపీగా పోటీ చేసిన అనుభవం ఉన్న వారికి కాకుండా ఎక్కువగా కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చారు. కొత్త ముఖాలు ఎక్కువ ఓట్లు తీసుకరాగలరని ఆశిస్తే ఇది కొత్త, పాత నాయకుల మధ్య కుమ్ములాటకు దారితీసింది. ఏళ్ల తరబడి నియోజక వర్గంలో తిరుగుతూ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న పాత నాయకులను వదిలేసి  అశోక్‌ గెహ్లాట్, సచిన్‌ పైలట్లకు పరిచయం ఉన్నవారికి టిక్కెట్లు ఇవ్వడం వల్లన కొంప మునిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మూడు రాష్ట్రాల్లో  రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామంటూ రాహుల్‌ గాంధీ ఇచ్చిన హామీని నమ్మి రైతులు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేశారు. అయితే ఇప్పటికీ సగం మందికి పైగా రైతుల రుణాలు మాఫీ కాలేదట. వారంతా కాంగ్రెస్‌ పార్టీకి ఈ సారి ఓట వేయలేదట. 

మరిన్ని వార్తలు