‘పవన్‌ మీరెందుకు ఫిర్యాదు చేయలేదు’

21 Apr, 2018 11:55 IST|Sakshi

సాక్షి, అమరావతి : మీడియాపై పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్‌ జర్నలిస్టు ఫోరం తీవ్రంగా ఖండించింది. ఎవరో యువతి ఆయన తల్లిని దూషించిందని ఆ వార్తలను కొన్ని చానళ్లు కవర్‌ చేశాయని, ఆగ్రహంతో ఊగిపోతూ మీడియా మొత్తాన్ని శాసించాలని చూడటం మంచి పద్ధతి కాదని హితవు పలికింది. ఈ మేరకు ఏపీ జర్నలిస్టు ఫోరం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది.

వాస్తవానికి శ్రీరెడ్డి వాడిన పదాలను ఏ చానెల్ కూడా సంస్కారంతో ప్రసారం చేయలేదని తెలిపింది. కానీ పవన్‌ మాత్రం ఆయన తల్లిపై జరిగిన దూషణలను మీడియా ప్రసారం చేసినట్లు భ్రమించి ఆరోపణలు చేస్తున్నారని తప్పుబట్టింది. మీడియా ఎలా ఉండాలో, ఏ వార్తలు ప్రచురించాలో లేదా ప్రసారం చేయాలో వేరొకరు నిర్ణయించాల్సిన స్థితిలో ఎవరూ లేరని వ్యాఖ్యానించింది. సినిమాలు ఎలా ఉండాలో మీడియా స్క్రిప్ట్ చూసి బావుందని చెబితే మీరు యాక్ట్ చేస్తారా ?? అని ప్రశ్నించింది. ‘మీ సినిమాలు ఎలా ఉండాలో మేము చెప్పడం లేదు కదా.. మీరు పెట్టిన రాజకీయ పార్టీ ఎలా నడవాలో మేము చెప్పడం లేదు కదా.. జర్నలిజంను మీరు శాసించడానికి ప్రయత్నించవద్దు’ అని హితవు పలికింది.

‘ప్రజలకు సేవ చేసేందుకు ప్రజాక్షేత్రంలోకి వస్తున్నామని చెప్పుకుంటున్న పవన్‌ విమర్శలు, ఆరోపణలను కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని పేర్కొంది. ‘అంతేగానీ భౌతిక దాడులు చేయడం మీ పార్టీ సిద్ధాంతమా ..?. తల్లిని దూషించారని ఆవేదన వ్యక్తం చేస్తున్న మీరు.. ఫిల్మ్ చాంబర్ దగ్గర ఒక మహిళా జర్నలిస్ట్‌పై మీ అభిమానుల దాడిని సమర్ధిస్తున్నారా?. మీడియా ప్రతినిధులను చంపుతాం. యాసిడ్ దాడులు చేస్తామంటూ మీ జనసైన్యం బెదిరిస్తోంది. దీనికి నైతిక బాధ్యత వహిస్తారా..? మీ ఆధ్వర్యంలోనే మీ అభిమానులు ఏబీఎన్ వాహనాన్ని ధ్వంసం చేయడం, మిగిలిన మీడియా ప్రతినిధులను బెదిరించడం ఎంతవరకు కరెక్టో చెప్పాలి. టీవీ 9, ఏబీఎన్, టీవీ 5 చానెళ్లను బ్యాన్ చేయాలని చెప్పడం ద్వారా మీరు మీ కార్యకర్తలకి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు? మహాటీవీపై నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తూ చానెల్ యాజమాన్యాన్ని బెదిరించే ప్రయత్నం చేయడం సరికాదు. గత కొద్దిరోజులుగా సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌తో ఎందరో మహిళలు వారి ఆవేదనను మీడియా ముందుకు వచ్చి కన్నీటి పర్యంతమైన సంఘటనలు మీకు కనిపించలేదా? సినిమా చాన్సులు ఇస్తామంటూ మైనర్ బాలికలను సైతం వదలకుండా లైంగిక దోపిడీకి పాల్పడితే సినిమా ఇండస్ట్రీలో పెద్దలుగా ఉన్న మీరు గానీ, మీ కుటుంబ సభ్యులుగానీ ఎందుకు స్పందించలేదు. అదేమంటే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసుకోవాలని సలహా ఇచ్చిన మీరు మీ తల్లిగారి విషయంలో మరో మహిళ మీ తల్లిని దూషించారని ఎందుకు పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇవ్వలేదు? మీడియా పట్ల అభ్యంతరాలుంటే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయొచ్చన్న విషయం మీకు తెలియదా? మీకొచ్చిన కష్టం యావత్తు రాష్ట్ర ప్రజలకు వచ్చిన కష్టంలా చిత్రీకరిస్తూ మీ అభిమానులను రెచ్చగొడాతారా? ఇదెంతవరకు సమంజసమో పార్టీ అధ్యక్షుడిగా మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం’ అని ఏపీ జర్నలిస్టు ఫోరం పేర్కొంది.

మరిన్ని వార్తలు