బీజేపీకి మరో షాక్‌ ఇవ్వనున్న అఖిలేశ్‌..!

6 May, 2018 14:49 IST|Sakshi

లక్నో : గోరఖ్‌పూర్, ఫూల్‌పూర్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీకి షాక్‌ ఇచ్చిన మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ రానున్న కాలంలో అదే జోరును కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ మద్దతుతో ఎస్పీ అభ్యర్థులు విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో సీఎం, డిప్యూటీ సీఎంలు యోగి, మౌర్య ఈ స్థానాల్లో విజయం సాధించిన  సంగతి తెలిసిందే. ఉప ఎన్నికల్లో మాత్రం అధికార పార్టీ సిట్టింగ్‌ స్థానాల్లో ఎస్పీ అభ్యర్థులు గెలుపొందడం ఆ పార్టీలో నూతన ఉత్సహాన్ని నింపింది. అదే స్ఫూర్తిగా కైరానా లోక్‌సభ, నూర్‌పూర్‌ అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.  సాధారణ ఎన్నికల్లో ఈ స్థానాల్లో గెలుపొందిన బీజేపీ నాయకలు మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

గత ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఏకం చేసి విజయం సాధించిన అఖిలేశ్‌ అదే వ్యుహాన్ని మళ్లీ రచిస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్రీయ్‌ లోక్‌ దళ్‌తో జట్టు కట్టారు. కైరానా లోక్‌సభ స్థానానికి ఎస్పీ నేతను ఆర్‌ఎల్‌డీ పార్టీ తరఫున పోటీ చేయించనున్నారు. అదేవిధంగా నూర్‌పూర్‌ అసెంబ్లీ స్థానానికి ఆర్‌ఎల్‌డీ అభ్యర్థిని ఎస్పీ తరఫున నిలుపనున్నారు. దీనిద్వారా ఇరు పార్టీల కార్యకర్తలు విజయం కోసం శ్రద్ధగా పనిచేస్తారని అఖిలేశ్‌తోపాటు, ఆర్‌ఎల్‌డీ ఉపాధ్యక్షుడు జయంత్‌ చౌదరి భావిస్తున్నారు.

ముస్లిం, దళితుల ఓట్లు కీలకంగా ఉన్న కైరానా లోక్‌సభ స్థానంలో 2009లో ఎస్పీ తరఫున విజయం సాధించిన తబుసమ్‌ హసన్‌ను ఎస్పీ-ఆర్‌ఎల్‌డీ కూటమి తమ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే మాయావతి మాత్రం ఇక్కడ ఎస్పీ అభ్యర్థికి మద్దతు తెలిపేది లేదని చెప్పడం, కాంగ్రెస్‌ కూడా ఆర్‌ఎల్‌డీ అభ్యర్థికైతేనే మద్దతు తెలుపుతామని చెప్పడంతో అఖిలేశ్‌ తమ పార్టీ అభ్యర్థిని ఆర్‌ఎల్‌డీ తరఫున బరిలోకి దింపనున్నట్టు తెలుస్తోంది. బీజేపీ తరఫున చనిపోయిన హుకుమ్‌ సింగ్‌ కుమార్తె మ్రింగాక సింగ్‌ను ఆ స్థానంలో బరిలోకి దించారు.

మే 28న జరగనున్న ఈ ఉప ఎన్నికల్లో విజయం ద్వారా బీజేపీకి గట్టి షాక్‌ ఇవ్వడంతోపాటు, కార్యకర్తల్లో నూతన ఉత్తేజం తీసుకురావచ్చని అఖిలేశ్‌ భావిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ మద్దతు పొందిన ఎస్పీ-ఆర్‌ఎల్‌డీ కూటమికి ఒకవేళ మాయావతి మద్దతు తెలిపితే విజయం సులువవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు