రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి అయితే..!

19 Apr, 2019 11:10 IST|Sakshi

బెంగళూరు : ఎన్నికల్లో పోటీ చేయబోనని కొన్ని సంవత్సరాల కిందట ప్రకటించిన మాజీ ప్రధానమంత్రి, జేడీఎస్‌ అధినేత దేవెగౌడ మళ్లీ ఎన్నికల బరిలోకి నిలువడం కొత్త చర్చకు దారితీసింది. 85 ఏళ్ల వయస్సులోనూ ఆయన కర్ణాటక తూముకూర పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల ఆమోదం ఉంటే.. ఏకగ్రీవ అభ్యర్థిగా దేవెగౌడ మళ్లీ ప్రధానమంత్రి అవుతారని ఆయన తనయుడు కుమారస్వామి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో తాజాగా ఏఎన్‌ఐ వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన దేవెగౌడ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గతంలోనే ఎన్నికల నుంచి తప్పుకొంటానని ప్రకటించినా.. మళ్లీ పరిస్థితులు తనను పోటీ చేసేలా పురికొల్పాయని దేవెగౌడ తెలిపారు. ప్రస్తుతానికి తనకు ఎలాంటి రాజకీయ ఆశయాలు, ఆశలు లేవని తెలిపారు. బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీలా క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకునే ఉద్దేశం కూడా తనకు లేదని ఆయన చెప్పారు. తన పార్టీని కాపాడుకోవడమే తన ప్రధాన ఉద్దేశమని, అధికారమనేది ఆ తర్వాతి విషయమేనని తెలిపారు.

ఏకగ్రీవ అభ్యర్థిగా దేవెగౌడ మళ్లీ ప్రధానమంత్రి అయ్యే అవకాశముందని ఆయన తనయుడు, కర్ణాటక సీఎం హెచ్‌డీ దేవెగౌడ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘ఆ విషయం గురించి నేనేమీ ఆలోచించడం లేదు. నా బాధంతా మోదీ మళ్లీ పార్లమెంటులో అడుగుపెడతారనే.. ప్రధాని ముఖం ముందే అడిగే దమ్మూ, ధైర్యం నాకున్నాయి’ అని దేవెగౌడ పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి అయితే.. ఆయనకు అండగా నిలబడతానని, ప్రధాని కావాలని తనకు లేదని చెప్పుకొచ్చారు. చిన్న పార్టీ అయినప్పటికీ, తమకు సోనియాగాంధీ కర్ణాటకలో మద్దతుగా నిలిచారని, కాంగ్రెస్‌ పార్టీతో కలిసి సాగాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. పార్టీ కన్నా కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలపై స్పందిస్తూ.. ‘పార్టీ స్థాపించినప్పుడు నాతో సమిష్టిగా పనిచేసినవారు.. ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్‌లో, ఇంకొంతమంది బీజేపీలో ఉన్నారు. దీంతో పార్టీ కొంత దెబ్బతిన్నా.. చెదిరిపోకుండా నిలబెట్టాను. నా కుటుంబసభ్యులు పార్టీ అధ్యక్షుడు కాకుండా నేను అడ్డుకున్నాను’ అని దేవెగౌడ తెలిపారు. 

మరిన్ని వార్తలు