సావార్కర్‌పై వ్యాఖ్యలు.. రాహుల్‌పై పరువునష్టం దావా!

15 Dec, 2019 15:37 IST|Sakshi

సాక్షి, ముంబై: ‘నా పేరు రాహుల్‌ గాంధీ. రాహుల్‌ సావర్కర్‌ కాదు. నేను నిజమే మాట్లాడాను. చావనైనా చస్తాను కానీ క్షమాపణ మాత్రం చెప్పను’అని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలపై పలు హిందూ సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూవులు దైవంతో సమానంగా పూజించే సావార్కర్‌ను కించపరిచే విధంగా రాహుల్‌ వ్యాఖ్యానించారని మండిపడుతున్నారు. దీనిపై తాజాగా వీర్‌ సావార్కర్‌ మనవడు రంజిత్‌ సావార్కర్‌ స్పందించారు. రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేస్తానని ఆయన తెలిపారు. అలాగే దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో కూడా చర్చిస్తానని ఆయన పేర్కొన్నారు. రాహుల్‌ వ్యాఖ్యలను ఖండించాలని ఠాక్రేను కోరనున్నట్లు ఆయన ప్రకటించారు. (నా పేరు రాహుల్‌ సావర్కర్‌ కాదు)

ఆదివారం ముంబైలో నిరసన ర్యాలీని చేపట్టిన రంజిత్‌ ఆ సమావేశంలో ప్రసంగించారు. శివసేన హిందుత్వ సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలని, కాంగ్రెస్‌తో స్నేహానికి ముగింపు పలకాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఠాక్రే మంత్రివర్గంలోని కాంగ్రెస్‌ మంత్రులను వెంటనే తొలగించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్‌ గాంధీతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్ర్య పోరాట యోధులను గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు.

రాహుల్‌ ‘సావర్కర్‌’ వ్యాఖ్యలపై శివసేన  ఇదివరకే స్పందించింది. హిందుత్వ సిద్ధాంతాల విషయంలో తమ పార్టీ రాజీపడే ప్రసక్తే లేదని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ స్పష్టం చేశారు. ‘వీర్‌ సావర్కర్‌ మహారాష్ట్రకు మాత్రమే కాదు.. దేశం మొత్తానికి ఆదర్శనీయమైన వ్యక్తి. నెహ్రూ, గాంధీలకు లాగానే సావర్కర్‌ కూడా దేశం కోసం తన ప్రాణాలు అర్పించారు. అలాంటి వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’అని ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు