రజనీ విధానాలను విమర్శించేందుకు సిగ్గుపడను

13 Mar, 2018 13:59 IST|Sakshi

సాక్షి, చెన్నై : తాను రజనీకాంత్‌ విధానాలను విమర్శించేందుకు సిగ్గుపడబోనని ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడిగా మారిన కమల్‌ హాసన్‌ అన్నారు. అయితే, తన విమర్శలు వ్యక్తిగతంగా మాత్రం ఉండబోవని స్పష్టం చేశారు. ప్రస్తుతం నాలుగు జిల్లాల్లో ఆయన పార్టీ (మక్కల్‌ నీది మయ్యం) పర్యటన జరుపుతోంది. జిల్లాల్లోని పలు సమస్యలను అవగాహన చేసుకునేందుకు ఆయన ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..

'నేను రజనీకాంత్‌ మంచి మిత్రులం.. అయితే, ఆయన విధానాలు విమర్శించేందుకు సిగ్గుపడబోను. అది కేవలం ఆయన విధానాలకు, నిబంధనలకు మాత్రమే పరిమితమై ఉంటుందే తప్ప వ్యక్తిగతంగా మాత్రం ఉండబోదు. ఆయనను ముందు రానివ్వండి (రాజకీయాల్లోకి).. పార్టీ పేరును ప్రకటించనివ్వండి. నేను మాత్రం ఒకటి స్పష్టం చేయదలుచుకున్నాను.. నా పార్టీ ముఖ్య విధానం ప్రజా సంక్షేమం. అలాగే, రజనీని కూడా ఆయన విధానాలు ప్రకటించనివ్వండి.. అందులో ఏవైనా మా పార్టీకి సంబంధించి ఉంటాయేమో చూద్దాం. ఇరువురి విధానాల్లో కొంత భేదాభిప్రాయాలు ఉండొచ్చు. నేను మాత్రం పార్టీ విధాన పరంగానే విమర్శలు చేస్తానేగానీ వ్యక్తిగతంగా కాదు.. అదే రాజకీయపరంగా గౌరవం కూడా' అని కమల్‌ అన్నారు. తన పార్టీ అధికారంలోకి వస్తే గ్రామీణ వ్యవస్థపైనే ఎక్కువగా గురిపెడుతుందని, ఉద్యోగాల కల్పన, మంచి విద్యను అందించడమే తమ ప్రధాన ఉద్దేశాలుగా ఉంటాయని స్ఫష్టం చేశారు.

మరిన్ని వార్తలు