ఏ పార్టీది విజయమో చెప్పేది ‘మెవధ్‌‌’

7 Dec, 2018 14:13 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాజస్థాన్‌ దక్షణ మధ్య ప్రాంతమైన మెవర్‌ లేదా మెవధ్‌లో శుక్రవారం ఉదయం నుంచే పోలింగ్‌ జోరుగా సాగుతోంది. ఈ ప్రాంతం విజయానికి రహదారి అని, ఏ పార్టీ విజయం సాధించి ఐదేళ్లపాటు అధికారంలో ఉంటుందో నిర్ణయించేది ఈ ప్రాంతం ఓటర్లేనన్నది రాజకీయ విశ్లేషకులు విశ్వాసం. ఇక్కడి ఓటర్లకు ఓ విచిత్రమైన ఆనవాయితీ ఉంది. 1998 నుంచి ఈ మెవధ్‌ ప్రాంతం ఓటర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు తప్ప, ఏనాడు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసిన దాఖలాలే లేవు. అందుకనే 1998 నుంచి ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారుతూ వస్తోందని రాజకీయ పరిశీలకుల అవగాహన.

మెవధ్‌ పరిధిలోకి రాజస్థాన్‌లోని భిల్‌వారా, చిత్తోర్‌గఢ్, ప్రతాప్‌గఢ్, దుంగార్పూర్, బాన్స్‌వాడా, ఉదయ్‌పూర్‌ జిల్లాలు, ఝలావర్‌ జిల్లాలోని పిరవ తెహసిల్‌తోపాటు మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలు వస్తాయి. రాజస్థాన్‌లోని 200 సీట్లకుగాను రాజస్థాన్‌లోని మెవ«ద్‌ ప్రాంతంలో 28 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో పాలకపక్ష భారతీయ జనతా పార్టీకి ఏకంగా 25 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ పార్టీ రెండు సీట్లను గెలుచుకోగా, మరో సీటులో స్వతంత్య్ర అభ్యర్థి విజయం సాధించారు. అంతకుముందు ఐదేళ్ల క్రితం, అంటే 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెవద్‌లో కాంగ్రెస్‌ పార్టీ అఖండ విజయం సాధించింది.  ఈ ప్రాంతం ఓటర్లు ఈ రోజు కూడా పాలకపక్షానికి వ్యతిరేకంగా ఓటేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయడం ఆనవాయితీగా మారిందిగదా అని ఓటేస్తున్నారా లేదా నిజంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా? అంటూ ఈ ప్రాంతం ఓటర్లను మీడియా కదిలించగా, తామేమి గుడ్డిగా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ రావడం లేదని, ఈసారి వ్యతిరేకించడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయని వారన్నారు. ‘రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. నిరుద్యోగం బాగా పెరిగింది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల వ్యాపారులే కాకుండా సామాన్య ప్రజలు కూడా బాగా నష్టపోయారు. ముఖ్యంగా రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. విత్తనాలు, ఎరువులు, డీజిల్, కరెంట్‌ ధరలు బాగా పెరిగిపోయాయి’ అని వారన్నారు.

‘మా నాన్నది ఇంట్లో ఉన్నదంతా ఊడ్చి వ్యవసాయంపై పెట్టారు. కనీసం పెట్టుబడి కూడా లేదు. అందుకనే నేను పొరపాటున కూడా వ్యవసాయం జోలికి వెళ్లదల్చుకోలేదు. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాను. ప్రభుత్వం ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏనాడు వ్యవసాయాన్ని పట్టించుకోలేదు. ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగాలిస్తామంది. నేను చదువుకోవాలనుకోవడానికి ఒక కారణం మోదీ ఇచ్చిన హామీనే. అయితే ఆయన ప్రభుత్వం ఏం చేయలేకపోయింది’ చిత్తోర్‌గఢ్‌కు చెందిన 18 ఏళ్ల యువకుడు మాన్‌సింగ్‌ తెలిపారు. ఓ పక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే బీజేపీ హనుమంతుడి కులం గురించి చర్చిస్తోందని బేగు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బాబూ రామ్‌ విమర్శించారు. ‘2013 అసెంబ్లీ ఎన్నికల్లో నేను బీజేపీకే ఓటేశాను. ఎంతో అభివృద్ధి జరుగుతుందని ఆశించాను. ఏం జరిగిందీ? పాలకులు కుల గోత్రాల గురించి, జాతి, మతాల గురించి, పటేల్, రాముడి విగ్రహాలు గురించి మాట్లాడుతున్నారు. విగ్రహాలేమైనా ప్రజలకు తిండి పెడతాయా?’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఓపియం పంటకు కొత్త లైసెన్సులూ కారణమే!
గంజాయి (ఓపియం) పంటకు 2017లో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం లైసెన్స్‌ నిబంధనలను మార్చిందని, ఫలితంగా ఇక్కడ ఎంతో మంది రైతులు లైసెన్సులు కోల్పోయారని, అది కూడా తమ ఆగ్రహానికి కారణమని ఓటర్లు చెబుతున్నారు. దేశంలో లైసెన్స్‌లతో ఉత్పత్తవుతున్న గంజాయితో 60 శాతం మెవధ్‌లోనే పండిస్తున్నారు. రాష్ట్ర జనాభాలో 12 శాతం ఉన్న రాజ్‌పుత్‌లు కూడా ఈసారి బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2017లో దీపికా పదుకోన్‌ నటించిన ‘పద్మావత్‌’ సినిమాను నిషేధించాల్సిందిగా తాము దేశవ్యాప్తంగా ఆందోళన చేసినా వసుంధర రాజె ప్రభుత్వం తమకు న్యాయం చేయలేక పోయిందని, దాంతో తమ ప్రతిష్ట దెబ్బతిన్నదని ‘మెవర్‌ క్షత్రియ మహాసభ సంస్థాన్‌’ అధ్యక్షుడు తన్వీర్‌ సింగ్‌ కృష్ణావత్‌ తెలిపారు. మేవధ్‌ ప్రాంతంలోని 16 అసెంబ్లీ సీట్లలో ఆదివాసీలు 73 శాతం ఉన్నారు. వారంతా కూడా పాలకపక్షాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాంతంలోని 11 సీట్లలో కొత్తగా ఆవిర్భవించిన ‘భారతీయ ట్రైబల్‌ పార్టీ’ పోటీ చేస్తోంది. ఈ అభ్యర్థుల వల్ల పాలకపక్ష ఓట్లే చీలుతాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు