కాపుల అభివృద్ధికి కృషి చేస్తా

12 Aug, 2019 04:49 IST|Sakshi
మాట్లాడుతున్న జక్కంపూడి రాజా

కాపు రిజర్వేషన్లను చంద్రబాబు మంట కలిపారు

రాజకీయ లబ్ధి కోసం నాటకాలాడారు

కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ జక్కంపూడి రాజా

సాక్షి, అమరావతి: కాపుల అభివృద్ధికి కృషి చేస్తానని కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ జక్కంపూడి రాజా చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి తమకు దైవమని, ఆయన తర్వాత తమ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉన్న సీఎం వైఎస్‌ జగన్‌తోనే ఎప్పటికీ నడుస్తానని స్పష్టం చేశారు. కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా రాజా ఆదివారం విజయవాడలోని ఏ కన్వెన్షన్‌ హాలులో ప్రమాణస్వీకారం చేశారు. రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తమను వైఎస్‌ జగన్‌ ఆదుకున్నారన్నారు. కాపు రిజర్వేషన్లను చంద్రబాబు మంట కలిపారని, కాపులను అయోమయానికి గురి చేస్తూ రాజకీయ లబ్ధి కోసం నాటకాలాడారని ధ్వజమెత్తారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు న్యాయం చేస్తానని సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. 

కాపులను చంద్రబాబు మోసం చేశారు
గతంలో తాను కాపుల సమావేశానికి వెళ్తే చంద్రబాబు నిలదీశారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి.. ఐదేళ్లలో రూ.రెండు వేల కోట్లు కూడా టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేయలేదని మంత్రి కన్నబాబు విమర్శించారు. బాబును కాపులు నమ్మరని ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని తేల్చిచెప్పారు. కాపులంతా ఆరాధించే నేత జగన్‌ అని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం కాపులను వాడుకొని వదిలేసిందని మంత్రి బొత్స సత్యనారాVయణ ధ్వజమెత్తారు. జగన్‌కు కాపులంతా వెన్నంటి ఉండాలని పిలుపునిచ్చారు. కాపులను ఏ రంగంలోనూ ఎదగనివ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజా విమర్శించారు.

కాపుల అభివృద్ధికి రూ.వేల కోట్లు కేటాయించి వారి అభివృద్ధికి సీఎం వైఎస్‌ జగన్‌ బాటలు వేశారని ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను అన్నారు. కాపులను బీసీల్లో చేరుస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. మంజునాథ కమిషన్‌ నివేదిక వ్యతిరేకంగా ఉండటంతో.. కమిషన్‌ సభ్యుల రిపోర్టు కేంద్రానికి ఇచ్చేలా చంద్రబాబు చేశారని మండిపడ్డారు. రెండు రిపోర్టులపై కేంద్రం అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు ప్రభుత్వం సమాధానమే ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య, కాపు కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ కొత్తపల్లి సుబ్బారాయుడు, వైఎస్సార్‌సీపీ ఎంపీలు వంగా గీత, బాలశౌరి, సినీ దర్శకుడు వి.వి.వినాయక్, పలువురు కాపు సంఘం నేతలు మాట్లాడారు.

మరిన్ని వార్తలు