ఎన్నికలకు ముందే మమత విజయం

30 Apr, 2018 19:25 IST|Sakshi

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) అధినేత్రి, బెంగాల్‌ సీఎం మమత బెనర్జీ మరోసారి తన సత్తా చూపించారు. మే 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగనున్న పంచాయతీ ఎన్నికల్లో 34 శాతం సీ​ట్లు ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికల నామినేషన్‌ గడువు శనివారంతో ముగియడంతో ఎన్నికల కమిషన్‌ నామినేషన్లకు సంబంధించిన వివరాలను విడుదల చేసింది. మొత్తం 58,692 పంచాయతీ స్థానాలకుగాను 20,000 పంచాయతీల్లో విపక్ష పార్టీల నుంచి అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేయకపోవడంతో ఆ స్థానాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ విజయం సాధించినట్లయింది. రాష్ట్ర చరిత్రలో ఇంత మొత్తంలో సీట్లు ఏకగ్రీవం కావడం ఇదే తొలిసారి. గతంలో వామపక్ష పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 11 శాతం సీట్లు  ఏకగ్రీవంగా గెలుచుకుంది.

రాష్ట్రంలో టీఎంసీ కార్యకర్తలు విపక్ష అభ్యర్థులను నామినేషన్‌ వేయకుండా హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని బీజేపీ, లెఫ్ట్‌ పార్టీలు ఆరోపిస్తున్నాయి. టీఎంసీ కార్యకర్తల చర్యలకు భయపడి అభ్యర్థులు నామినేషన్‌ వేయడానికి భయపడ్డారని, తృణమూల్‌ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని బెంగాల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ ఆధీర్‌ రాజన్‌ చౌదరీ విమర్శించారు. టీఎంసీ నేతలు సామాన్యుల రాజకీయ హక్కును హరిస్తున్నారని ఆరోపించారు. కాగా ఇటీవల బీర్బూమ్‌లో జరిగిన ఘర్షణలో  ఓ వ్యక్తి మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయలైన విషయం తెలిసిందే.

నామినేషన్ల గడువు ముగిసే సమయానికి మొత్తం 58,693 స్థానాలకుగాను అధికార తృణమూల్‌ కాంగ్రెస్ నుంచి 72,000, బీజేపీ నుంచి 35,000, వామపక్ష పార్టీల నుంచి 22,000, కాంగ్రెస్‌ నుంచి 10,000 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. బెంగాల్‌ పంచాయతీ ఎన్నికలు మొదటి నుంచి వివాదాస్పదంగానే మారాయి. నామినేషన్‌ వేయకుండా అధికార టీఎంసీ ఇతర పార్టీ అభ్యర్థులను అడ్డుకుంటుందని విపక్షాలు కోల్‌కతా హైకోర్టును కూడా ఆశ్రయించాయి. దీనితో కోర్టు నామినేషన్లు గడవు ఒకరోజుకు పెంచింది. కొంత మంది అభ్యర్ధులు తమ నామినేషన్‌ పత్రాలను వాట్సాప్ ద్వారా పంపించడం, వాటిని అనుమతించాలని హైకోర్టు ఆదేశించడం తెలిసిందే. ఎన్నికల కమిషన్‌ అధికార తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని, హైకోర్టు ఆదేశాలను ఎన్నికల కమిషన్‌ ఉల్లంఘించిందని  లోకసభ మాజీ స్పీకర్‌ సోమనాథ్‌ చటర్జీ విమర్శించారు.

మరిన్ని వార్తలు