చంద్రబాబు తీరుపై మహిళా రైతు ఆగ్రహం 

13 Jan, 2020 12:10 IST|Sakshi

పెదవాల్తేరు (విశాఖతూర్పు): రైతుల విషయంలో చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని విజయనగరం జిల్లా భోగాపురం ప్రాంతానికి చెందిన రైతు దాట్ల శ్రీదేవి ఆదివారం ఓ ప్రకటనలో విమర్శించారు. రాజధాని తరలింపు విషయమై అమరావతిలో రైతులచే ఆందోళన చేయిస్తున్నారని.. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్టుకు భూసేకరణ సమయంలో ఆ ప్రాంత రైతులు చేసిన ఆందోళనలను పట్టించుకోకుండా.. వారిని అష్టకష్టాల పాల్జేశారని మండిపడ్డారు.

అప్పట్లో ఎంతోమందిపై క్రిమినల్‌ కేసులు పెట్టారని, తనపై నాలుగు కేసులు పెట్టి.. పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి.. రైతులపై దౌర్జన్యం చేయించారని తెలిపారు. మహిళలు, వృద్ధులు, పిల్లలని కూడా చూడకుండా పోలీసు, రెవెన్యూ అధికారులు దమనకాండ సాగించారని పేర్కొన్నారు. ఊర్లకు ఊర్లు ఖాళీ చేయించి స్టేషన్లకు తరలించి భూ సేకరణకు సర్వే చేశారని తెలిపారు. భూములపై హక్కులను కాపాడుకునేందుకే నాడు ఆందోళన చేశామని.. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తమకు సంఘీభావం ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు.

అమరావతి రైతులు రూ.4 లక్షల విలువైన ఎకరం భూమిని రూ.కోట్లకు అమ్ముకున్నారని, కానీ భోగాపురం ఎయిర్‌పోర్టు భూసేకరణ విషయంలో మాత్రం నాటి టీడీపీ ప్రభుత్వం ఎకరానికి కేవలం రూ.18 లక్షల నుంచి 33 లక్షల చొప్పున రేటు నిర్ణయించిందని.. కానీ ఇక్కడ ఎకరం రూ.3 కోట్లు ఉందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో భూసేకరణ కారణంగా ఎన్నో కుటుంబాల్లో వివాహాలు ఆగిపోయాయని.. అప్పుడు ఒక మంత్రిగానీ, ఎమ్మెల్యేగానీ తమను పరామర్శించిన పాపాన పోలేదని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు