ఇంతింతే!

28 Mar, 2019 12:26 IST|Sakshi

 లోక్‌సభలో మహిళా ప్రాతినిధ్యం అంతంతే..

ఇప్పటి వరకు 12 మంది మహిళల ప్రాతినిధ్యం

ఉమ్మడి రాష్ట్ర తొలి మహిళా ఎంపీ సంగం లక్ష్మీబాయి

తెలంగాణలో తొలి మహిళాఎంపీ కల్వకుంట్ల కవిత

స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ నిబంధన వల్ల పురుషులతో సమాన అవకాశాలు దక్కుతున్నాయి. కానీ చట్టసభలకు వచ్చే సరికి అభ్యర్థిత్వం ఆశించే మహిళలుంటున్నా గెలుపోటముల బేరీజులు, పార్టీ సమీకరణాలతో టికెట్లు దక్కడం లేదు. తెలంగాణ నుంచి పార్లమెంట్‌ స్థానాలకు ఎన్నోసార్లు ఎన్నికలు, ఉప ఎన్నికలు జరిగినా రాష్ట్రం నుంచి ఎంపీలుగా ఎన్నికైన మహిళలు 12 మందే..– కిషోర్‌ పెరుమాండ్ల, సాక్షి– మెదక్‌

గతమిలా...
వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గంలో 1984లో హన్మకొండకు చెందిన డాక్టర్‌ టి.కల్పనాదేవి తెలుగుదేశం పార్టీ ఎంపీగా కాంగ్రెస్‌ అభ్యర్థి కమాలుద్దీన్‌ అహ్మద్‌పై 8,456 ఓట్లతో విజయం సాధించారు. ఆమె 1989లో కాంగ్రెస్‌ అభ్యర్థి గంగారెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. కల్పనాదేవి వరంగల్‌ లోక్‌సభ చరిత్రలో ఏకైక మహిళా ఎంపీ. ఆమె 1990లో కాంగ్రెస్‌ పార్టీలో చేరి పీసీసీ ఉపాధ్యక్షురాలిగా, ఏఐసీసీ సభ్యురాలిగా పనిచేసి, 2016 మే 29న గుండెపోటుతో మరణించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో జన్మించిన కల్పనాదేవి వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ చేసి, వరంగల్‌లోనే ఓ నర్సింగ్‌ హోమ్‌లో మెడికల్‌ ప్రాక్టీషనర్‌గా చేస్తూ పేదలకు వైద్యసేవలందించారు.

రెండు సభల ప్రతినిధి లక్ష్మీకాంతమ్మ
ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి సీనియర్‌ రాజకీయ నాయకురాలు టి.లక్ష్మీకాంతమ్మ కాంగ్రెస్‌ అభ్యర్థిగా 1962లో సీపీఐకి చెందిన టి.విఠల్‌రావుపై 12,060 ఓట్ల మెజార్టీతో, 1967లో సీపీఎం అభ్యర్థి ఎంకేరావుపై 1,11,338 ఓట్లతో, 1971లో టీపీఎస్‌ అభ్యర్థి చేకూరి కాశయ్యపై 49,212 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మహబూబ్‌నగర్‌ జిల్లా అలంపూర్‌లో 1924 జూలై 16న జన్మించిన ఆమె మచిలీపట్నంలో బీఏ చేసి, విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1944లో ఆమెకు ఫారెస్ట్‌ ఆఫీసర్‌ వెంకట్రావుతో వివాహం తర్వాత మద్రాస్‌లో ఎంఏ పూర్తి చేశారు. అనంతరం లాల్‌బహుదూర్‌శాస్త్రి చొరవతో రాజకీయ ప్రవేశం చేశారు. ఇదే స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా ఫైర్‌బ్రాండ్‌ రేణుకాచౌదరి 1999లో టీడీపీ అభ్యర్థి బేబీ స్వర్ణకుమారి మద్దినేనిపై 8,398 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2004లో టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వర్‌రావుపై 1,08,888 ఓట్ల మెజార్టీతో గెలిచారు రేణుక. అయితే 2009 ఎన్నికల్లో మాత్రం ఆమె మరోసారి కాంగ్రెస్‌ అభ్యర్థిగా రంగంలోకి దిగి, సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి నామా చేతిలో ఓటమి పాలయ్యారు. 1954 ఆగస్టు 13న జన్మించిన రేణుకాచౌదరి 1984లో రాజకీయ అరంగేట్రం చేశారు. టీడీపీ నుంచి రెండు పర్యాయాలు రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. చీఫ్‌ విప్‌గా, కేంద్రంలో హెచ్‌డీ దేవెగౌడ కేబినెట్‌లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత తెలుగుదేశం పార్టీని విడిచి 1998లో కాంగ్రెస్‌లో చేరారు. పార్లమెంట్‌లోని వివిధ కమిటీల్లో సభ్యురాలిగా, 2004లో యూపీఏ ప్రభుత్వంలో మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా చేశారు.

ప్రధానమంత్రి సీటు
మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 1967లో స్వతంత్ర అభ్యర్థి కె.రామయ్యపై కాంగ్రెస్‌ అభ్యర్థి సంగం లక్ష్మీబాయి 84,665 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌లో జన్మించిన లక్ష్మీబాయి ధీరవనితగా పేరు గడించారు. సాయుధ పోరాటంతోపాటు స్వాతంత్య్ర సంగ్రామంలో కూడా పాల్గొన్నారామె. ఆమె జీవిత చరమాంకం వరకూ తాను ముందుండి మహిళలను నడిపించారు. ఇదే నియోజకవర్గం నుంచి 1980లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కాంగ్రెస్‌ (ఐ) అభ్యర్థిగా... జనతా పార్టీ అభ్యర్థి ఎస్‌.జైపాల్‌ రెడ్డిపై 2,19,124 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఎమర్జెన్సీ తర్వాత 1980లో మెదక్‌ ఎంపీగా గెలిచి మళ్లీ ప్రధాని పదవి చేపట్టడం విశేషం.

ఇదే నియోజకవర్గం నుంచి 2009లో సినీ నటి విజయశాంతి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచి కాంగ్రెస్‌కు చెందిన సి.నరేంద్రనాథ్‌పై 6,077 ఓట్లతో గెలుపొందారు. 1966 జూన్‌ 24న జన్మించిన విజయశాంతి 30 ఏళ్లు సినీ నటిగా పలు భాషల్లో సుమారు 180 సినిమాల్లో నటించి ‘లేడీ సూపర్‌ స్టార్, లేడీ అమితాబ్‌’గా దక్షిణ భారతదేశంలో పేరు తెచ్చుకున్నారు. 1998లో బీజేపీలో చేరి భారతీయ మహిళా మోర్చా కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆ తర్వాత కాలంలో తల్లి తెలంగాణ పార్టీ స్థాపించారు. అనంతర కాలంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. 2009 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరపున మెదక్‌ ఎంపీగా చేసిన అనంతర క్రమంలో కాంగ్రెస్‌లో చేరారు. మెదక్‌ నుంచి పార్లమెంట్‌కు ఎన్నికైన ముగ్గురు మహిళల్లో ఒక ఫ్రీడమ్‌ ఫైటర్, ఒక పొలిటికల్‌ స్టార్, ఒక ఫిల్మ్‌ స్టార్‌ ఉన్నారు.

సీతమ్మ సన్నిధి నుంచి..
భద్రాచలం తెలుగు రాష్ట్రాల వారధి. ఈ లోక్‌సభ నియోజకవర్గం 2009 పునర్విభజనలో కనుమరుగైంది.అంతకు ముందు ఈ లోక్‌సభ స్థానం నుంచి 1967లో కాంగ్రెస్‌ అభ్యర్ధి రాధాబాయి ఆనందరావు.. సీపీఎం అభ్యర్థి శాంతరాజుపై 67,235 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత ఆమె 1971లో సీపీఎం అభ్యర్థి ఎన్‌.బుజ్జిపై 68,048 ఓట్లు, 1977లో బీఎల్‌డీ అభ్యర్థి పీవీ  రమణారావుపై 95,968 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అలాగే 1980లోనూ సీపీఐకి చెందిన కారం చంద్రయ్యపై 68,326 ఓట్ల మెజార్టీతో గెలుపొందారామె. రాధాబాయి ఖమ్మం జిల్లా వెంకటాపురం గ్రామంలో 1930 ఫిబ్రవరి 2న జన్మించారు. రాజమండ్రిలో విద్యనభ్యసించారు. ఆమె పార్లమెంట్‌లోని పలు కమిటీలకు ప్రాతినిధ్యం వహించారు. ఇదే లోక్‌సభ నియోజకవర్గం నుంచి 1989లో కర్రెద్దుల కమలకుమారి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి సీపీఐకి చెందిన సిట్టింగ్‌ ఎంపీ సోడే రామయ్యపై 23,986 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 1991లో జరిగిన ఎన్నికల్లో సోడే రామయ్యపై 44,171 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కమలకుమారి ఆంధ్రప్రదేశ్‌లోని లక్కవరంలో 1946 ఆగస్టు 8న జన్మించారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ చొరవతో కాంగ్రెస్‌లో చేరి, కేంద్ర మంత్రిగా ఏఐసీసీ సభ్యురాలిగా పనిచేశారామె. ఇదే భద్రాచలం నియోజక వర్గం నుంచి 1999లో దుంపా మేరీ విజయకుమారి టీడీపీ నుంచి బరిలో నిలిచి కాంగ్రెస్‌ అభ్యర్థిని రత్నాబాయిపై 37,103 ఓట్ల మెజార్టీతో విజయ బావుటా ఎగురవేశారు. విజయకుమారి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం జిల్లా నాతవరంలో 1952 జూలై 9న జన్మించారు. ప్రభుత్వ పాలనా శాస్త్రంలో పీజీ చేశారు. రాజకీయాల్లోకి రాకముందు బీహెచ్‌పీవీలో ఉద్యోగం చేస్తూ సామాజిక సేవలో పాలుపంచుకునేవారు. భద్రాచలం నుంచి కూడా రాధాబాయి, కమలకుమారి, విజయకుమారి మొత్తం ముగ్గురు మహిళలు లోక్‌సభకు ఎన్నికయ్యారు.

ఉద్యమ నాయిక
నిజామాబాద్‌ లోక్‌సభ పరిధిలో ఇప్పటి వరకు 16 పర్యాయాలు ఎన్నికలు జరగ్గా, ఒకే ఒక్క మహిళ గెలిచారు. ఆమె సీఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత. 2014లో టీఆర్‌ఎస్‌ నుంచి బరిలో నిలిచిన కవిత కాంగ్రెస్‌ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్‌పై 1,67,184 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆమె నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా ఎంపీగా రికార్డుల్లోకెక్కారు. 1978 మార్చి 13న కేసీఆర్, శోభ దంపతులకు జన్మించిన ఆమె బీటెక్, ఎంఎస్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చేసి, అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేశారు. 2004లో తిరిగి ఇండియాకి వచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో ఊరూరా, దేశవిదేశాల్లో బతుకమ్మ పండుగల నిర్వహణతోపాటు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా యువతలో ఉపాధి నైపుణ్యాలు పెంచుతూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఇటీవల స్టీరింగ్‌ కమిటీ ఆఫ్‌ కామన్వెల్త్‌ ఉమెన్‌ పార్లమెంటేరియన్స్‌ (సీడబ్ల్యూపీ)కు నామినేట్‌
అయ్యారామె.

ప్రస్తుత ఎన్నికల్లో..
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఆరుగురు మహిళలు పోటీ చేస్తున్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ నుంచి ఇద్దరు చొప్పున, కాంగ్రెస్, సీపీఎం నుంచి ఒకరు చొప్పున బరిలో ఉన్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి నిజామాబాద్‌ లోక్‌సభకు కల్వకుంట్ల కవిత, మహబూబాబాద్‌ లోక్‌సభకు మాలోతు కవిత.. బీజేపీ నుంచి మహబూబ్‌నగర్‌ ఎంపీ స్థానానికి డీకే అరుణ, నాగర్‌కర్నూల్‌ లోక్‌సభకు బంగారు శృతి.. కాంగ్రెస్‌ నుంచి ఖమ్మం లోక్‌సభకు రేణుకాచౌదరి, నల్లగొండ ఎంపీ స్థానానికి సీపీఎం తరపున మల్లు లక్ష్మి పోటీలో వున్నారు.

దక్కన్‌ డాక్టర్‌
పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం 1962 నుంచి ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానంగా ఉంది. ఈ పార్లమెంట్‌ నియోజకవర్గంలో టీడీపీకి చెందిన చెల్లమల్ల సుగుణకుమారి 1998లో కాంగ్రెస్‌ అభ్యర్ధి జి.వెంకటస్వామిపై 6,174 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అలాగే 1999లో 15,889 ఓట్ల మెజారిటీతో గెలుపొందారామె. 2004లో మాత్రం వెంకటస్వామి చేతిలో ఓటమి పాలయ్యారు. చెల్లమల్ల సుగుణకుమారి 1955లో హైదరాబాద్‌లో జన్మించారు. ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్, ఎండీ డీజీఓ, డీసీహెచ్‌ విద్యనభ్యసించారు. సుగుణకుమారి సేవా కార్యక్రమాల్లో ముందుంటూ రాజకీయాల్లోకి వచ్చి టీడీపీలో చేరారు.

లష్కర్‌ ‘మణి’
సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అంజయ్య సతీమణి మణెమ్మ 1987లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి బరిలో నిలిచి సుమారు 92,000 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి బీపీ.రెడ్డిపై విజయం సాధించారు. ఆ తర్వాత 1989లో జనతాదళ్‌ అభ్యర్ధి పి.బాబుల్‌రెడ్డిపై 1,47,601 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే 1991లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి చెందిన బండారు దత్తాత్రేయ చేతిలో 85,063 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ప్రముఖ కార్మిక నాయకులు, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అంజయ్య హఠాన్మరణం (1986)తో ఆయన భార్య మణెమ్మ రాజకీయాల్లోకి వచ్చారు.

ఇందిరాగాంధీ
టి. మణెమ్మ
సుగుణకుమారి
సంగం లక్ష్మీబాయి
విజయశాంతి
రేణుకాచౌదరి
డి. మేరీ విజయకుమారి
కె. కవిత
డా‘‘ కల్పనా దేవి
రాధాబాయి ఆనందరావు

మరిన్ని వార్తలు