వారే నంబర్‌ 1

21 Mar, 2019 08:00 IST|Sakshi

రాష్ట్రంలో మహిళా ఓటర్లే అధికం

ఎలక్షన్‌ డెస్క్‌ :  ఆంధ్రప్రదేశ్‌లో పురుషుల ఓటర్లతో పోలిస్తే.. మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఎన్నికల సంఘం ఈ ఏడాది జనవరి 11న ప్రకటించిన తుది జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3కోట్ల 69లక్షల 33వేల 91 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు కోటి 83లక్షల 24 వేల 588 మంది ఉండగా.. మహిళా ఓటర్లు కోటి 86లక్షల 4వేల 742 మంది ఉన్నారు. పురుషులతో పోలిస్తే.. 2లక్షల 80వేల 154 మంది మహిళా ఓటర్లు అధికం. రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు కలిగిన జిల్లాగా తూర్పుగోదావరి నిలిచింది. ఈ జిల్లాలో మొత్తం 40లక్షల 13వేల 770 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 20లక్షల 18వేల 747 మంది కాగా.. పురుషులు 19లక్షల 94వేల 639 మంది ఉన్నారు. ఇక్కడ పురుషులతో పోలిస్తే మహిళలు 24వేల 108 మంది అధికం. అత్యల్ప ఓటర్లు గల జిల్లాగా విజయనగరం నిలిచింది. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 17లక్షల 33వేల 667. వీరిలో మహిళలు 8లక్షల 75వేల 222 కాగా, పురుషులు 8లక్షల 58వేల 327. ఇక్కడ పురుషులతో పోలిస్తే మహిళలు 16వేల 895 మంది అధికం. విశేషం ఏమంటే.. శ్రీకాకుళం, గుంటూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో మహిళల కంటే పురుష ఓటర్లే అధికంగా నమోదయ్యారు. శ్రీకాకుళంలో 7,168 మంది, గుంటూరులో 64,454 మంది, అనంతపురంలో 21,168 మంది, చిత్తూరులో 17,924 చొప్పున పురుష ఓటర్లు అధికంగా ఉన్నారు. నియోజకవర్గాల వారీగా చూస్తే.. అత్యధిక ఓటర్లు కలిగిన అసెంబ్లీ నియోజకవర్గంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నిలిచింది. ఇక్కడ మొత్తం ఓటర్లు 2,70,495 మంది ఉన్నారు. వారిలో మహిళలు 1,37,018 కాగా, పురుషులు 1,33,434 మంది. ఇక్కడ పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 3,584 మంది అధికం. ఈసారి కూడా భీమిలి రెండో స్థానంలో నిలిచింది. ఆ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,64,520 ఉన్నారు. వారిలో మహిళలు 1,32,839, కాగా, పురుషులు 1,31,671 మంది. ఇక్కడ పురుషులతో పోలిస్తే మహిళలు 1,168 మంది అధికం. రాష్ట్రంలోనే తక్కువ ఓటర్లున్న అసెంబ్లీ స్థానాల్లో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, కృష్ణా జిల్లా పెడన నిలిచాయి. నరసాపురంలో మొత్తం ఓటర్లు 1,59,144 కాగా, వారిలో మహిళలు 79,416 మంది, పురుషులు 79,727 మంది ఉన్నారు. ఇక్కడ మహిళల కంటే పురుషులు 311 మంది అధికం. ఆ తర్వాత పెడన  నియోజకవర్గంలో 1,59,215 ఓటర్లు ఉన్నారు. వారిలో మహిళలు 79,472 కాగా, పురుషులు 79,736 మంది. మహిళలతో పోలిస్తే పురుష ఓటర్లు 264 మంది అధికంగా నమోదయ్యారు. 

గత ఎన్నికల్లో 20 మంది
2014లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 20 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. రాష్ట్రం మొత్తం మీద విజయనగరం జిల్లాలోనే అతి తక్కువ అసెంబ్లీ స్థానాలు 9 ఉండగా అత్యధికంగా.. ఇదే జిల్లా నుంచి నలుగురు మహిళలు ఎమ్మెల్యేలుగా ఉండటం విశేషం. ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, కృష్ణా, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి ఇద్దరు చొప్పున ఉన్నారు. కాగా, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఒకే ఒక్క మహిళా ఎమ్మెల్యే ఉన్నారు. గత ఎన్నికల్లో గెలిచిన మొత్తం 20 మంది మహిళా ఎమ్మెల్యేల్లో నలుగురు ఎస్టీలు, ఐదుగురు చొప్పున ఎస్సీలు, బీసీలు ఉన్నారు. కాగా, అగ్రవర్ణాలకు చెందినవారు ఆరుగురు ఉన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న రెండో జిల్లా గుంటూరు నుంచి ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా లేరు. ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి.

మరిన్ని వార్తలు