జోన్‌ విషయం కోర్టులో తేల్చుకుంటాం  

16 Jun, 2018 08:42 IST|Sakshi
పరిగిలోని తన నివాసంలో  మాట్లాడుతున్న ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి   

 ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర పునర్విభజన చట్టానికి విరుద్ధం

కాంగ్రెస్‌ పార్టీలో మహిళలకు ప్రాధాన్యమిస్తాం

పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

పరిగి: జోన్‌ విషయంలో జిల్లాకు ప్రభుత్వం అన్యాయం చేసింది.. ఇక ప్రభుత్వంతో కోర్టులో తేల్చుకుంటామని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పరిగిలోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

జోన్‌ విషయంలో ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా  సీఎం కేసీఆర్‌ ఏకపక్ష నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేసి న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పదేళ్ల పాటు కొత్త జోన్లు చేయటానికి వీలుకాదని చెప్పారు.

దీని ఆధారంగా కోర్టులో పిల్‌ వేసి నిరుద్యోగులు, ఉద్యోగులకు న్యాయం జరిగేలా చూస్తానని పేర్కొన్నారు. వికారాబాద్‌ జిల్లా ప్రజల ఆకాంక్షల మేరకు చార్మినార్‌ జోన్‌లోనే చేర్చాలని డిమాండ్‌ చేశారు. ప్రజల ఆకాంక్షలను విస్మరించి సీఎం ఒంటెద్దు పోకడపోతున్నారని మండిపడ్డారు.

నిరుద్యోగ యువతకు కానిస్టేబుల్, వీఆర్వో శిక్షణ ఇప్పించేందుకు దరఖాస్తులు ఆహ్వానించగా 1,350 దరఖాస్తులు అందాయని తెలిపారు. వారికి పీజేఆర్‌ టెక్నికల్‌ సపోర్టుతో త్వరలో ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. 

త్వరలో పార్టీ అనుబంధ కమిటీలు 

పార్టీ బలోపేతానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. 14 మంది అంకితభావం గల కార్యకర్తలు, నాయకులతో బూత్‌ స్థాయి కమిటీలు వేస్తామని చెప్పారు. వీరు ప్రతి బూత్‌ పరిధిలో 25 మంది కార్యకర్తలను శక్తి యాప్‌లో చేరుస్తారని పేర్కొన్నారు.

శక్తి యాప్‌లో చేరిన ప్రతి కార్యకర్త బయోడేటా డిజిటలైజేషన్‌ అవుతుందన్నారు. శక్తి యాప్‌లో చేరిన ప్రతి కార్యకర్త ఆన్‌లైన్‌ ద్వారా రాహుల్‌గాంధీతో సంబంధం కలిగి ఉంటారని వివరించారు. ప్రతి ఐదు బూత్‌లకు ఒకరి చొప్పున బూత్‌ కో ఆర్డినేటర్లను నియమిస్తామని తెలిపారు. పార్టీ అనుబంధ కమిటీల్లో మహిళలు, యువతకు తగిన ప్రాధాన్యం ఇస్తామన్నారు.

మరిన్ని వార్తలు