‘వ్యవస్థ వల్ల బాధింపబడిన వారి కోసమే ఈ పార్టీ’

18 Dec, 2018 17:15 IST|Sakshi

న్యూఢిల్లీ : జనాభాలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నాం. దాదాపు 120 కోట్ల పైచిలుకు జనాభాలో అతివలది అర్థభాగం. కానీ దేశ రాజకీయాల్లో వారి స్థానం అంటే కేవలం వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంత. ప్రస్తుతం దేశంలో ఒకే ఒక్క మహిళా ముఖ్యమంత్రి ఉన్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మహిళల భవితవ్యం మాత్రం మారడం లేదు. రాజకీయాల్లో మరింత మంది మహిళలకు అవకాశం కల్పించే మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఏ పార్టీలు పట్టించుకోవు. కారణం ఈ బిల్లు పాస్‌ అయితే మగవాళ్ల ఆధిక్యం తగ్గుతుందనే భావన. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న కొద్ది మంది మహిళల్లో కూడా వారసత్వంగా వచ్చిన వారే అధికంగా ఉన్నారు.  ఈ పరిస్థితులను మార్చాలనే ఉద్దేశంతో ఓ రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. ఆ వివరాలు..

న్యూఢిల్లీకి చెందిన శ్వేతా శెట్టి(36) అనే వైద్యురాలు, సామాజిక కార్యకర్త ‘నేషనల్‌ ఉమెన్స్‌ పార్టీ’(ఎన్‌డబ్ల్యూపీ) అనే రాజకీయ పార్టీని స్థాపించారు. అమెరికాలో దశబ్దాల క్రితం ఏర్పాటు చేసిన నేషనల్‌ ఉమెన్స్‌ పార్టీ స్ఫూర్తిగా తీసుకుని దీన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్వేతా శెట్టి మాట్లాడుతూ.. ‘వ్యవస్థ చేతిలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న వారి కోసం.. సాయం కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగే వారి కోసం.. సామాజిక వివక్షతను ఎదుర్కొంటున్న వారి కోసం.. గృహ హింసను ఎదుర్కొంటున్న వారి కోసం ఈ పార్టీని స్థాపించాము’ అని చెప్పారు.

పార్టీ స్థాపన కోసం 2012 నుంచే ప్రయత్నాలు ప్రారంభించామన్నారు. 2018లో కూడా మహిళల పట్ల చాలా నేరాలు జరిగాయి.. వారి హక్కులను కాల రాశారు. మహిళా సాధికారత అసలే లేదు. వీటన్నింటిని పరిష్కరించాలంటే రాజకీయాల్లో మహిళల సంఖ్య పెరగాలన్నారు. దానికోసం తమ పార్టీ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం సీట్లు కేటాయిస్తుందని ప్రకటించారు. ఒక ఎన్జీవో ద్వారా తెలంగాణలో కూడా పని చేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. మహిళా సంక్షేమానికి సంబంధించిన బిల్లులు చట్టం రూపం దాల్చాలంటే పార్లమెంట్‌లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలని శ్వేత కోరుకున్నారు.

మరిన్ని వార్తలు