మహాకూటమితో దేశ రాజకీయాల్లో మార్పు

23 Oct, 2018 01:53 IST|Sakshi
టీటీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ నేతలతో మాట్లాడుతున్న చంద్రబాబు

మనం తీసుకున్న ప్రతి సీటు గెలవాలి

టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలు ఆషామాషీ కాదని, ఇక్కడ ఏర్పాటవుతున్న మహాకూటమి దేశ రాజకీయాల్లో మార్పు తీసుకొ  స్తుందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కూటమి ఏర్పాటులో భాగంగా పార్టీపరంగా 119 స్థానాల్లో పోటీ చేయలేమని, పట్టింపులు, పంతాలకు పోతే లక్ష్యం నెరవేరదని, గెలిచే సీట్లు తీసుకోవాలని తెలంగాణ నేతలకు దిశా నిర్దేశం చేశారు. సోమవారం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, కేంద్ర కమి టీ సభ్యులతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల ఇన్‌చార్జులతో సమావేశమయ్యారు.

రెండు రాష్ట్రాల మధ్య ఇబ్బందుల్లేకుండా ఉండాలని తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవాలని యత్నించినా సాధ్యం కాలేద ని, తెలంగాణలో టీడీపీతో పొత్తు ఉండదని బీజేపీ ఏకపక్షంగా ప్రకటించిందని పునరుద్ఘాటించారు. ఈ రెండు పార్టీలు ఒక్కటే లైన్‌లో ఉన్నాయని చెప్పారు. ఆ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయ పార్టీలతో కూటమి ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించామని, ఈ ఎన్నికల్లో కూటమి విజయమే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. 

పొత్తు చర్చలు, సీట్ల సర్దుబాటు, ఎన్నికల ప్రచారం లాంటి విషయాలన్నింటినీ రాష్ట్ర పార్టీనే చూసుకోవాలని, అవసరమైతే రెండు మూడు చోట్ల ప్రచార సభ ల్లో తాను కూడా పాల్గొనే ఆలోచన చేస్తానన్నారు. కూటమితో సర్దుబాటు చేసే బాధ్యతలను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, పొలిట్‌బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావులకు అప్పగించారు. కూట మి ఏర్పాటులో రమణ తీసుకుంటున్న చర్యల ను అభినందించారు. సమావేశంలో పార్టీ నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, నామా నాగేశ్వరరావు, పెద్దిరెడ్డి, బండ్రు శోభారాణి, బక్కని నర్సింహులు, గరికపాటి రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు