‘ఎంపీ కావడమే గొప్ప.. మంత్రి పదవిపై ఆశ లేదు’

27 May, 2019 18:17 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ : కార్పోరేటర్‌గా ఉన్న తనకు ఎంపీగా పనిచేసే అవకాశమే గొప్ప అని, మంత్రి పదవిపై ఆశలేదని బీజేపీ నేత, కరీంనగర్‌ లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక సామన్య కార్యకర్తగా ఉన్న తనను ఎంపీగా గెలిపించిన ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. కరీంనగర్‌ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. ఎన్నికల ముందు వరకే రాజకీయాలు అని ఇకపై అభివృద్ధి కోసం పని చేద్దామని మిగతా పార్టీలను కోరారు.

‘ ఒక సామన్య కార్యకర్త అయిన నన్ను ఎంపీగా గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు. నర్సరీ పిల్లల నుంచి వందేళ్ల వృద్ధుల వరకు నేను గెలవాలని తపించారు. కార్యకర్తలకు రూపాయి ఖర్చు చేయకపోయినా సొంతంగా పెట్రోల్‌ పోసుకొని నా కోసం ఇల్లిల్లు తిరిగారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తా. హిందూ సమాజాన్ని సంఘటితం చేసేందుకు ఎప్పటిలాగే అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాను. పార్లమెంట్‌ సమావేశాలకు, కరీంనగర్‌ ప్రజల పనుల కోసం తప్ప ఢిల్లీ, హైదరాబాద్‌కు వెళ్లను. ప్రజల మధ్యే ఉంటూ వారి అభివృద్ధి కోసం కృషి చేస్తా. పెండింగ్‌లో ఉన్న స్మార్ట్‌ సిటీ పనుల కోసం అవసరమైతే మరిన్ని నిధులు తెస్తాం’  అని సంజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. తనకు మంత్రి పదవిపై ఆశలేదని, సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మెద్దని కోరారు. 

టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, సిట్టింగ్‌ ఎంపీ  వినోద్‌ కుమార్‌పై 87 వేలపైగా ఓట్ల తేడాతో బండి సంజయ్‌ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన  బండి సంజయ్ కు  లోక్‌సభ ఎన్నికల్లో సానుకూల, సానుభూతి పవనాలు వీచాయి. గత ఎంపీ ఎన్నికల్లోనూ ఆయన పోటీచేసి ఓడిపోయారు. ఈ సారి మాత్రం భారీ విజయాన్ని అందిస్తూ కరీంనగర్‌ ప్రజలు సంచలన తీర్పును ఇచ్చారు. 

మరిన్ని వార్తలు