ప్రభుత్వ రంగ సంస్థలకు గడ్డు కాలం

31 Dec, 2017 01:17 IST|Sakshi
తంబళ్లపల్లె బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తంబళ్లపల్లె బహిరంగ సభలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

చంద్రబాబు పాలనలో మూత వేయడం తప్ప తెరిపించడం కలే 

ప్రైవేటు సంస్థలకు మాత్రం లాభాలే లాభాలు  

పాడి రైతులకు పొరుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల సహకారం 

రాష్ట్రంలో ధర తగ్గించి కొనుగోలు చేస్తున్న ప్రభుత్వ డెయిరీలు 

ప్రైవేట్‌ డెయిరీల లాభాల కోసమే రైతులకు అన్యాయం 

మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే లీటరు పాలకు రూ.4 సబ్సిడీ 

ప్రజా సంకల్పం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘రైతులకు తోడుగా నిలిచే సహకార, ప్రభుత్వ రంగ సంస్థలను బాగు పరచడానికి చంద్రబాబు ప్రభుత్వం ఎన్నడూ కృషి చేయలేదు. ఈయన హయాంలో ఇలాంటివన్నీ మూతపడుతూ ఉంటాయి. ఇదే సమయంలో ప్రైవేట్‌ సంస్థలకు మాత్రం బాగా లాభాలు వస్తాయ’ని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 47వ రోజు శనివారం సాయంత్రం ఆయన చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో బహిరంగ సభకు హాజరైన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. చంద్రబాబు ఇదివరకటి 9 ఏళ్ల పాలనలో కూడా సహకార, ప్రభుత్వ రంగ సంస్థలు మూత పడ్డాయన్నారు. నాన్న గారు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సహకార రంగంలోని చక్కర ఫ్యాక్టరీలకు రూ.51 కోట్ల మేరకు ఇచ్చి రైతులకు తోడుగా నిలిచారని గుర్తు చేశారు. మన ఖర్మకొద్దీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక.. జిల్లాలోని రేణిగుంట, చిత్తూరులో ఉన్న సహకార చక్కెర ఫ్యాక్టరీలు మూతపడే పరిస్థితిలో ఉంటే.. ప్రైవేట్‌ రంగంలో ఉన్న నాలుగు చక్కెర ఫ్యాక్టరీలు మాత్రం బాగా లాభాల్లో నడుస్తున్నాయన్నారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే

 మూతపడిన డెయిరీలను తెరిపిస్తాం 
‘పాడి ఉన్న ఇంట సిరులు పొంగునట....’ అనేది ఒక సామెత. తరచూ నాన్న గారు ఇదే సామెతను చెప్పే వారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో రైతులు పాల మీద జీవనం సాగిస్తున్నారు. రోజుకు 30 లక్షల లీటర్లు పాలు ఉత్పత్తి అవుతున్నా వారి పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయి. చంద్రబాబు వారిని ఆదుకోవాలన్న ఆలోచన చేయరు. హెరిటేజ్‌ సంస్థకు రైతుల నుంచి తక్కువ ధరకు పాలు ఎలా కొనాలనే దిక్కుమాలిన ఆలోచనలు మాత్రమే చేస్తూ ఉంటారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రభుత్వ డెయిరీలకు రైతులు పాలు అమ్మితే.. ఒక లీటరు పాలకు రూ.4 – రూ.5 చొప్పున సబ్సిడీ ఇస్తున్నారు. ఏపీలో మాత్రం రైతుల నుంచి లీటరుకు రూ.4 నుంచి రూ.5 తగ్గించి కొనాలనే దిక్కుమాలిన ఆలోచన చేస్తున్నారు.

తన ఫ్యాక్టరీకి లాభం రావాలంటే ప్రభుత్వ డెయిరీలకు పాల ధరను తగ్గించి కొనాలనేది చంద్రబాబు విధానం. అందుకే మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ డెయిరీలకు రైతులు అమ్మే ప్రతి లీటరు పాలకు నాలుగు రూపాయల సబ్సిడీ ఇస్తామని చెబుతున్నా. ప్రభుత్వ రంగంలో మూతపడిన పాల ఫ్యాక్టరీలన్నింటినీ తిరిగి తెరిపిస్తాం. ఫ్లోరైడ్‌ శాతం అధికంగా ఉన్న నీటి వల్ల తంబళ్లపల్లె ప్రజలకు కాళ్లు వంకర పోతున్నాయి. హంద్రీ–నీవా నుంచి నీళ్లు వస్తే తప్ప బతుకులు మారవు.

ఈ ప్రాంతానికి నీరివ్వాలనే ఉద్దేశంతోనే దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి తన హయాంలో హంద్రీ–నీవా ప్రాజెక్టును చేపట్టి 80 శాతం పనులు పూర్తి చేశారు. మిగిలిన 20 శాతం పనులను ఈ నాలుగేళ్లలో పూర్తి చేయలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారు. మనందరి ప్రభుత్వం వచ్చాక హంద్రీ–నీవాను పూర్తి చేసి ప్రతి చెరువుకూ నీరిస్తాను. ఈ ప్రాంతంలోని రైతులందరూ సుఖశాంతులతో ఉండేలా చేస్తాను’ అని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.  

మరిన్ని వార్తలు