టీడీపీ గురించి రాయండి

26 Mar, 2019 10:45 IST|Sakshi
అనంతపురం ఆర్ట్స్‌ కాలేజీ రూపొందించిన ప్రశ్నపత్రం

డిగ్రీ విద్యార్థులకు ప్రశ్న ఇచ్చిన అనంతపురం ఆర్ట్స్‌ కళాశాల

యథేచ్చగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన

ఎస్కేయూ: ఒక వైపు రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది. నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలను ప్రభావితం చేసేలా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం హెచ్చరిస్తోంది. అయితే అనంతపురం ఆర్ట్స్‌ కళాశాల యాజమాన్యం ఎన్నికల నిబంధనలన్నీ పక్కన పెట్టింది. అటానమస్‌ హోదా ఉన్న ఆర్ట్స్‌ కళాశాలకు సొంతంగా ప్రశ్నపత్రాలను రూపకల్పన చేసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో సోమవారం బీఏ రెండో ఏడాది, నాలుగో సెమిస్టర్, పొలిటికల్‌ సైన్స్‌ పరీక్షలో ఏకంగా ‘తెలుగుదేశం పార్టీ’ గురించి రాయమని అడిగారు. దీంతో విద్యార్థులు కంగుతిన్నారు. అధికార పార్టీ గురించి పరీక్షల్లో అడగటమేంటని నివ్వెరపోయారు. పరీక్ష అయిన తరువాత విద్యార్థులు ప్రశ్నపత్రాన్ని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. అధికార పార్టీకి ఇంత దాసోహం అవసరమా? అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పించారు. బాధ్యతగల అధ్యాపకులు ఇలా ఓ పార్టీ వైపు యువతను ప్రేరేపించే విధంగా ప్రశ్నలు ఎలా అడుగుతారని ప్రశ్నిస్తున్నారు. యథేచ్ఛగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ ప్రశ్నలు అడిగారని విద్యార్థులు బాహాటంగా విమర్శిస్తున్నారు.

మరిన్ని వార్తలు