బాబూ.. ప్రజల పక్షాన నువ్వెప్పుడున్నావ్‌..?

27 Mar, 2018 07:58 IST|Sakshi
మాట్లాడుతున్న ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి

చంద్రబాబుపై ఎమ్మెల్యే విశ్వ మండిపాటు

హోదాపై మాట్లాడితే కేసులు పెట్టించలేదా?

రాజకీయ ప్రయోజనాల     కోసమే యూటర్న్‌

టీడీపీలోనే ఆర్థిక నేరగాళ్లు

ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి     మండిపాటు

అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పొలిటికల్‌ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు రాష్ట్రం వైపు ఉన్నాయా.. కేంద్రం పక్షమా అని చంద్రబాబు అడగడం సిగ్గుచేటన్నారు. అసలు చంద్రబాబు రాష్ట్ర ప్రజల పక్షానికి ఎప్పుడొచ్చారో చెప్పాలన్నారు. మూడున్నరేళ్లు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా  ఉండి రాష్ట్ర ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబును విమర్శిస్తే వారి వెనుక బీజేపీ ఉన్నట్లు చిత్రీకరిస్తారా? అని మండిపడ్డారు. ప్రత్యేకహోదా సెంటిమెంటు అందరిలోనూ నాటుకుపోయిందన్నారు. ఈ సమయంలో మేల్కోకుంటే రాజకీయ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని భయపడే చంద్రబాబు ప్లేటు ఫిరాయించారన్నారు. తనస్వార్థం కోసం ప్యాకేజీకి అంగీకరించి ఇప్పుడేమో మోసపోయామంటూ మొసలి కన్నీరు కార్చుతున్నారన్నారు. ముందునుంచి ప్రత్యేక హోదా విషయంలో వైఎస్సార్‌సీపీ ఉద్యమిస్తోందని గుర్తు చేశారు.

రాష్ట్రంలో హోదా ఉద్యమాలు జరిగితే పీడీ యాక్ట్‌లు, కేసులు పెట్టడమే కాకుండా హేళనగా మాట్లాడలేదా? అని ప్రశ్నించారు. చీకటిలో ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకోవాల్సిన అవసరం ఏంటన్నారు. ఈ  విషయంలో ఏ పార్టీతోనైనా కనీసం చర్చించలేదన్నారు. తాను ఏమి చేసినా, ఏమి మాట్లాడినా అనుకూల మీడియా రక్షిస్తుందన్న అహంకారంతో చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి 29 సార్లు ఢిల్లీ పర్యటించి ఏం సాధించారని ప్రశ్నించారు.  ఎంపీ విజయసాయిరెడ్డిని విజయ్‌మాల్యాతో పోల్చడం ఏంటన్నారు. ఆయనేం దేశం వదిలివెళ్లలేదని ౖతనపై బనాయించిన అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటున్నారన్నారు. త్వరలోనే నిర్దోషిగా నిరూపించుకుంటారన్నారు. టీడీపీలో ఉన్న సుజనాచౌదరి, దీపక్‌రెడ్డి, నారాయణరెడ్డి ఆర్థిక నేరగాళ్లు కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతికి సీఎం సమాధానం చెప్పాలన్నారు. జన్మభూమి కమిటీల నుంచి సీఎం వరకు అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయారన్నారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ కూడా చంద్రబాబు కేబినేట్, తనయుడు అవినీతిపై మాట్లాడారని గుర్తు చేశారు. చంద్రబాబు కొడుకుపై అవినీతి అనేలోగా అమిత్‌షా కొడుకు గుర్తుకొచ్చాడా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కసారైనా అఖిలపక్షం వేశారా అని అడిగారు. సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, కార్యదర్శులు ఈడిగ ప్రసాద్, నిరంజన్‌గౌడ్, తేజోనాథ్, నాయకులు రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు