అఖిలేష్‌ వైపే యాదవ యువతరం

22 Apr, 2019 21:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌ లోక్‌సభ ఎన్నికలు నువ్యా, నేనా అన్నట్లు పోటీ పడుతున్న బీజేపీ, ఎస్సీ, బీఎస్సీ కూటములకు ప్రతిష్టాత్మకంగా పరిణమించడమే కాకుండా యాదవ్‌లు ఎక్కువగా ఉన్న నియోజక వర్గాల్లో ఎవరికి ఓటు వేయాలనే విషయంలో యాదవ్‌ల మధ్య కూడా చర్చలు తీవ్రమయ్యాయి. రాష్ట్రంలో యాదవ్‌ల ప్రయోజనాలను పరిరక్షించగలిగిన సత్తా ఒక్క అఖిలేష్‌ యాదవ్‌కే ఉందని, ఆయనకు ఆయన తండ్రి ములాయం సింగ్‌ యాదవ్‌కన్నా పెద్ద నాయకుడు అయ్యే అవకాశం ఉందని అమర్‌ సింగ్‌ యాదవ్‌ వాదిస్తుండగా, మన కమ్యూనిటీ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాల కన్నా దేశ ప్రయోజనాలు ముఖ్యమని, ప్రధాని నరేంద్ర మోదీ చేతుల్లోనే దేశం సురక్షితంగా ఉంటుందని వినోద్‌ సింగ్‌ యాదవ్‌ వాదిస్తున్నారు. వీరిద్దరు బాల్య మిత్రులు. ఇప్పటి వరకు వారు ఏ విషయంలో వారు విభేదించిన దాఖలాలు లేవు. రాష్ట్రానికి ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన నాటి నుంచి వారిద్దరి మధ్య ఎవరిని సమర్థించాలనే విషయమై ప్రతిరోజు ఈ వాదన చెలరేగుతూనే ఉంది.

ఓ చిన్న రవాణా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న అమర్‌ సింగ్‌ యాదవ్‌ వద్దకు ప్రతిరోజు వినోద్‌ సింగ్‌ యాదవ్‌ వచ్చి ఓటు విషయమై వాదనకు దిగుతారు. వారి మిత్రులు చెరోవైపు చేరి పోతారు. చివరికి మెజారిటీ మిత్రులు అమర్‌ సింగ్‌ యాదవ్‌ పక్షం చేరిపోగా, వినోద్‌ సింగ్‌ యాదవ్‌ ససేమిరా అమర్‌ సింగ్‌ యాదవ్‌తో ఏకీభవించడం లేదు. దాంతో ఎన్నికలయ్యే వరకు తన షాపు వద్దకు రావద్దంటూ వినోద్‌ సింగ్‌ను అమర్‌ సింగ్‌ కోరారు. మోదీకి ఓటేస్తానని ఒప్పుకునే వరకు తాను వస్తూనే ఉంటానని వినోద్‌ సింగ్‌ స్పష్టం చేశారు. మోదీ వల్ల దేశానికి ఒరిగిందేమిటో చెప్పమని అమర్‌ సింగ్‌ సవాల్‌ చేశారు. మోదీ వల్ల మన యాదవులతోపాటు, పేదలకు, మధ్య తరగతి కుటుంబాల వారికి పక్కా ఇళ్లు, కరెంట్‌ సదుపాయం, స్వచ్ఛ భారత సిద్ధించాయని వినోద్‌ సింగ్‌ తెలిపారు.

‘మన రాష్ట్రంలో మన యాదవ్‌లకు గత పదేళ్ల నుంచే పక్కా ఇళ్లు ఉన్నాయి. ఏ రోజున కరెంట్‌ పోయిన సందర్భాలు మనకు లేవు. ఇక స్వచ్ఛ భారత్‌ సంగతి దేవుడెరుగు! ఏ రోజున మన పరిసరాలు శుభ్రంగా లేవు. 2014 ఎన్నికల సందర్భంగా మోదీ ఇచ్చిన హామీల్లో ఒక్కటీ కూడా నెరవేరలేదు. సబ్‌కా వికాస్‌ అన్నారు. ఎక్కడా కనిపించడం లేదు. అయోధ్యలో రామాలయాన్ని కడతామన్నారు. ఇంతవరకు లేదు. 370 అధికరణను రద్దు చేస్తానన్నా అదీ లేదు. ఇప్పుడేమో మోదీ వీటన్నింటిని విస్మరించి పాకిస్థాన్, హిందూ–ముస్లింలు అంటూ విద్వేష అంశాలను అందుకున్నారు’ అంటూ అమర్‌ సింగ్‌ యాదవ్‌ వాదించారు.

ఫిరోజాబాద్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలో, ఎటావా లోక్‌సభ పరిధిలో నివసిస్తున్న సోను యాదవ్‌ అనే 23 ఏళ్ల యువకుడు అమర్‌సింగ్‌ యాదవ్‌ వాదనను విని తాను అఖిలేష్‌ యాదవ్‌ భయ్యా అభిమానినని చెప్పుకున్నారు. మోదీకి వ్యతిరేకంగా రాఫెల్‌ ఆరోపణలైనా వచ్చాయని, అఖిలేష్‌కు వ్యతిరేకంగా ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదని, సమీప భవిష్యత్తులో ప్రధాని అయ్యే అవకాశాలు, సామర్థ్యం అయనకు ఉన్నాయని, అవకాశం వస్తే మోదీకన్నా మంచి ప్రధాని అవుతారని అన్నారు. మోదీ వచ్చిన తర్వాత జరిగిదల్లా మరుగుదొడ్ల నిర్మాణం మాత్రమేనని, మోదీ కారణంగా మన రాష్ట్రంలో ఎలాంటి మార్పు లేదని, ఐదేళ్ల క్రితం రాష్ట్రం ఎలా ఉందో, ఇప్పుడలాగే ఉందన్నారు. అఖిలేష్‌ యాదవ్‌ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌ టాప్‌లు ఇవ్వడం లాంటి మంచి కార్యక్రమాలు అమలు చేశారని చెప్పారు. తాజ్‌ ఎక్స్‌ప్రెస్‌ కారిడార్‌ పూర్తవడం అఖిలేవ్‌ యాదవ్‌ పుణ్యమేనని చెప్పారు.

అమర్‌ సింగ్‌ యాదవ్, వినోద్‌ సింగ్‌ యాదవ్‌లు ఫిరోజాబాద్‌ నియోజక వర్గానికి చెందిన వారు. ఇక్కడ రేపు, మంగళవారం పోలింగ్‌ జరుగుతోంది. ఇక యాదవ్‌లు ఎక్కువగా ఉన్న మైపూరి, ఎటావా, షాజహాన్‌పూర్, కన్నాజ్‌లకు ఈ నెల 29న ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నియోజకవర్గాల్లో యాదవ్‌లు మోదీకి, అఖిలేష్‌ యాదవ్‌కు మధ్య చీలిపోగా, ఇప్పుడు ఎక్కువ మంది అఖిలేష్‌ వైపే మొగ్గు చూపుతున్నారు.

మరిన్ని వార్తలు