తనను చూస్తుంటే అమ్మ గుర్తుకువస్తోంది: యశోధరా రాజే

11 Mar, 2020 12:50 IST|Sakshi

భోపాల్‌: కాంగ్రెస్‌ పార్టీని వీడిన మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరనున్నారన్న వార్తలపై ఆయన మేనత్త, బీజేపీ ఎమ్మెల్యే యశోధరా రాజే సింధియా స్పందించారు. జ్యోతిరాదిత్య బీజేపీలో చేరడాన్ని ‘ఘర్‌ వాపసీ’గా ఆమె అభివర్ణించారు. ప్రస్తుతం సింధియా పరిస్థితి చూస్తుంటే.. తనకు తల్లి విజయరాజే గుర్తుకువస్తున్నారని ఉద్వేగానికి గురయ్యారు. ‘‘మేమేమీ పిచ్చివాళ్లం కాదు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. తను నిజంగా పెద్ద ముందడుగే వేశాడు’’అని పేర్కొన్నారు.(‘సింధియా’ రాజీనామాపై ప్రశాంత్‌ కిషోర్‌ ట్వీట్‌)

బుధవారం యశోధరా రాజే ఎన్డీటీవీతో మాట్లాడుతూ... ‘‘మా అమ్మ, మహారాణి విజయారాజేకు ప్రజలు, ఎమ్మెల్యేలు ఎంతో గౌరవం ఇచ్చేవారు. అయితే ద్వారకా ప్రసాద్‌ మిశ్రా కారణంగా ఆమె కాంగ్రెస్‌ పార్టీని వీడాల్సి వచ్చింది. అసలు ఆయన అమ్మకు కనీస గౌరవం కూడా ఇచ్చేవాడు కాదు. ఈ విషయం గురించి ఆమె ఎంతో బాధపడింది. అంతిమంగా పార్టీని వీడింది. ఇప్పుడు నా మేనల్లుడికి కూడా కాంగ్రెస్‌లో ఇలాంటి పరిస్థితే ఎదురైంది.  తను ప్రజల కోసం పనిచేశాడు. పార్టీకి జీవితాన్ని అంకితం చేశాడు. సీనియర్‌ నాయకుడిగా, మంత్రిగా బాధ్యతగా వ్యవహరించాడు. తను నిజంగా సమర్థవంతుడైన నాయకుడు కాకపోయినట్లయితే బీజేపీ తనను ఎందుకు చేర్చుకుంటుంది’’ అని కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు.(బీజేపీలో సింధియాలు.. సింధియాలో బీజేపీ )

కాగా గ్వాలియర్‌ రాజవంశీయుడైన జ్యోతిరాదిత్య సింధియా 18 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. గ్వాలియర్‌ రాజమాత విజయారాజే సింధియా రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ.. ఆమె కుమార్తెలు వసుంధరా రాజే, యశోధర బీజేపీలో ఉన్నప్పటికీ.. కుమారుడు మాధవరావు సింధియా మాత్రం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన 2001లో విమాన ప్రమాదంలో మరణించగా.. గుణ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమారుడు జ్యోతిరాదిత్య విజయం సాధించారు. అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. అయితే 2018లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ విజయంలో కీలకపాత్ర వహించిన జ్యోతిరాదిత్యను సీఎం పదవి వరిస్తుందని అంతా ఆశించారు. అయితే అనుభవజ్ఞుడైన కారణంగా కమల్‌నాథ్ వైపు మొగ్గుచూపిన అధిష్టానం ముఖ్యమంత్రి పదవిని ఆయనకే కట్టబెట్టింది. అనంతరం గుణ ఎంపీగా బరిలోకి దిగి సింధియా ఓటమి చవిచూశారు. ఈ నేపథ్యంలో మంగళవారం పార్టీని వీడుతున్నట్లు జ్యోతిరాదిత్య ప్రకటన చేశారు.(ఆ విషయం చరిత్రే చెబుతోంది: మహానార్యమన్‌)

మరిన్ని వార్తలు