మోదీ ప్రభుత్వంపై బీజేపీ సీనియర్‌ నేత ఫైర్‌

17 Apr, 2018 18:12 IST|Sakshi
యశ్వంత్‌ సిన్హా

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా మరోసారి విమర్శల వర్షం కురిపించారు. ఇటీవల బీజేపీ ప్రభుత్వం దళితుల పట్ల వ్యవహరిస్తున్న తీరును గట్టిగా వ్యతిరేకించిన యశ్వంత్‌  మరోసారి తన వ్యాఖ్యలతో అధికార పార్టీని ఇరుకున పెట్టారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ, మహిళల రక్షణ, విదేశాంగ విధానం, అంతర్గత ప్రజాస్వామ్యం​ తదితర అంశాలను ఆయన లేఖలో  ప్రస్తావించారు.

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ భారత్‌ అని బీజేపీ ‍ప్రభుత్వం చెపుతున్న వ్యాఖ్యలను యశ్వంత్ సిన్హా తిప్పికొట్టారు.  ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం కాగా.. దేశంలో రోజురోజుకు మహిళలకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రభుత్వం లైంగిక హత్యలకు ఆరికట్టకపోగా, కొందర బీజేపీ నేతలు  హత్యల్లో నిందితులుగా ఉన్నారని విమర్శించారు.  దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రస్తావిస్తూ... గత నాలుగేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతిన్నదని.. దేశంలో రైతులు, నిరుద్యోగులు, పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బ్యాంకింగ్‌ వ్యవస్థ పూర్తిగా అవినీతిమయంగా మారిందని, పేదల సొమ్ముతో విదేశాలకు పారిపొయిన వారిని పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై స్పందిస్తూ.. దేశంలో గతంతో పోలిస్తే మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటిలో బీజేపీ నేతల ప్రమేయం ఉన్నా వారిని శిక్షంచడంలో కేం‍ద్ర ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. విదేశాంగ విధానం పూర్తిగా అసంబద్దంగా ఉందని,  పాకిస్తా‍న్‌, చైనాతో అనుసరిస్తున్న విధానం దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. వివిధ దేశాలు తిరుగుతూ ఆ దేశ నేతలను కౌగిలించుకోవడం తప్ప మోదీ విదేశీ పర్యటనలతో దేశానికి ఎలాంటి లాభం లేదన్నారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం​ పూర్తిగా నాశనమైందని, ఎంపీలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలిపే అవకాశం కూడా మోదీ కల్పించలేకపోయారని దుయ్యబట్టారు. ఎలాంటి చర్చ జరగకుండానే పార్లమెంట్‌ సమావేశాలు తుడిచిపొట్టుకుపొవడాన్ని ప్రస్తావిస్తూ... దేశంలో ప్రజాస్వామ్యం ముప్పులో ఉందని సిన్హా హెచ్చరించారు. గత ఎన్నికల్లో బీజేపీ 31 శాతం ఓట్లు మాత్రమే సాధించిందని, 69 శాతం మంది ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు