కార్మికుల్లో అసహనం మొదలయితే అశాంతే..

20 May, 2020 19:47 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ వలస కూలీల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా విమర్శించారు. ఆయన ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూల్లో మాట్లాడుతూ.. దేశ వలస కూలీల సమస్యలను ప్రపంచం గమనిస్తుందని అన్నారు. వలస కూలీల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైనందున ప్రపంచంలో దేశ బ్రాండ్‌ ఇమేజ్‌ మసకబారిందన్నారు. కేంద్రం ప్రకటించిన 20లక్షల కోట్ల ప్యాకేజీని మోసపూరిత ప్యాకేజీగా ఆయన అభివర్ణించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను హృదయం లేని వ్యక్తిగా ఆయన అభివర్ణించారు. ఆర్థిక మంత్రి మొదటి ప్రసంగంలో వలస కార్మికుల ఊసెత్తలేదని అన్నారు.

కార్మికులు గమ్యస్థానానికి చేరే క్రమంలో అనేక మంది రోడ్డు ప్రమాదంలో చనిపోయారని సిన్హా అన్నారు. రెండో ప్రసంగంలో ఆర్థిక మంత్రి ప్రస్తావించినా.. చనిపోయిన వారికి కనీసం సంతాపం తెలపకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల రవాణా సదుపాయాలు దొరకక రోడ్డు వెంబడి వెళుతున్నారని.. దేశ విభజన సమయంలో కూడా ఇంత దారుణ పరిస్థితి లేదని వాపోయారు. గత రెండు నెలలుగా కార్మికులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం అని అన్నారు. ఈ సమస్యలు రావడానికి ప్రభుత్వానికి ప్రణాళిక లేకపోవడమే కారణమన్నారు. మొదటగా మార్చి 24న ఎలాంటి వ్యూహం లేకుండానే లాక్‌డౌన్‌ ప్రకటించారని విమర్శించారు. వలస కార్మికుల తరలింపు, సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలను ఆదుకోవాడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.

బీజేపీ ప్రభుత్వం తన అసమర్థతను రాష్ట్ర ప్రభుత్వాలపై మోపడానికి ప్రయత్నిస్తుందని ఎద్దేవా చేశారు.  రవాణా సదుపాయాలు లేక వలస కార్మీకులు గుంపులుగా చేరడం వల్ల కరోనా వ్యాప్తి వేగంగా జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. దేశంలో అనేక సంక్షోభాల్లో పాలన యంత్రాంగం అద్భుతంగా పనిచేసిందని.. ప్రస్తుతం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. ప్రభుత్వ ఉదాసీనత వల్ల కార్మికుల్లో అసహనం మొదలయితే సమాజంలో అశాంతి నెలకొంటుందని తెలిపారు. ఇప్పటికైన పాలనా యంత్రాంగాన్ని, సైనికుల సేవలను సమర్థవంతంగా వినియోగించుకోగలిగితే సమస్య పరిష్కారమయ్యే అవకాశముందని పేర్కొన్నారు.

చదవండి: 'తుక్డే తుక్డే గ్యాంగులో కేవలం ఆ ఇద్దరు మాత్రమే'

మరిన్ని వార్తలు