‘జేసీ సోదరులవి బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు’

19 Nov, 2017 07:48 IST|Sakshi

ముడుపులు తీసుకున్నట్లు నిరూపిస్తే తాడిపత్రి విడిచిపెట్టి పోతా...

నిరూపించకపోతే రాజకీయ సన్యాసం చేస్తారా? 

జేసీ సోదరులకు కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్‌ 

తాడిపత్రి : జేసీ సోదరులవి బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలని, సొంత పార్టీ ముఖ్యమంత్రినే బ్లాక్‌ మెయిల్‌ చేసే నీచ స్థాయికి దిగరాజారని వైఎస్సార్‌సీపీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు. శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జేసీ సోదరులపై నిప్పులు చెరిగారు. మద్యం షాపుల టెండర్లలో ముడుపులు తీసుకున్నానని నిరూపిస్తే తాడిపత్రి విడిచిపెట్టి పోయేందుకు  తాను సిద్ధమని బహిరంగ సవాల్‌ విసిరారు.

అలా నిరూపించని పక్షంలో జేసీ సోదరులు రాజకీయ సన్యాసం చేస్తారా? అని ప్రశ్నించారు. జేసీ సోదరులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం నియోజకవర్గ ప్రజల సమస్యలను అడ్డుపెట్టుకొని రాజీనామా పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునే బ్లాక్‌మెయిల్‌ చేసిన ఘనత జేసీ సోదరులదని పెద్దారెడ్డి ఏద్దేవా చేశారు. జేసీ సోదరుల బ్లాక్‌ మెయిల్, చిల్లర రాజకీయాలు జిల్లా ప్రజలందరికీ తెలుసునని, ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారన్నారు. 

ప్రజల దృష్టి మరల్చేందుకే అసత్య ఆరోపణలు :
బార్‌ విషయంలో ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలాంటి అసత్య ఆరోపణలకు ఎమ్మెల్యే జేసీ  తెరలేపారన్నారు. అధికార బలంలో జేసీ సోదరులు అధికారులను బెదిరించడం పరిపాటిగా మారిందన్నారు. తాడిపత్రి ప్రాంతంలోని పరిశ్రమలను జేసీ సోదరులు దోచుకుంటున్నారన్నారు. ఆయా పరిశ్రమల్లో తమకు కాంట్రాక్టులు, పర్సెంటేజీలు ఇవ్వకపోతే పరిశ్రమల ఎదుట ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తానని బెదిరించడం జేసీ సోదరుల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అన్నారు.

గ్రానైట్‌ పరిశ్రమల యజమానుల నుంచి డబ్బులు డిమాండ్‌ చేస్తే వారు ససేమిరా అనడంతో గ్రానైట్‌ పరిశ్రమల లోడు లారీలను తన అధికార బలంతో అడ్డుకోవడంతో గ్రానైట్‌ పరిశ్రమల ఉనికికే ప్రమాదకరంగా మారిందని, ఫ్యాక్టరీలు మూతపడే దశలో ఉన్నాయన్నారు. జేసీ సోదరులు తాడిపత్రిని అభివృద్ధి చేయలేదని, తాడిపత్రిని అడ్డుపెట్టుకొని వారు అభివృద్ధి చెందారని విమర్శించారు.  
 

మరిన్ని వార్తలు