ఓటుకు కోట్లు ఆడియోపై విచారణకు సిద్ధమా?

21 May, 2018 18:41 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న పార్థసారధి

వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లలో సాధ్యం కాని అభివృద్ధి ఒక్క ఏడాదిలో ఎలా సాధ్యమవుతుందని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘కర్ణాటకలో ఎమ్మెల్యేల కొనుగోలుపై ఆడియో టేపులపై విచారణ చేపట్టాలని మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్‌ చేశారు. అదేవిధంగా ఓటుకు కోట్లు కేసులో బాబు ఆడియో టేప్‌లు 90 శాతం మ్యాచ్‌ అవుతున్నాయి. బాబు ఆడియో టేపుపై కూడా యనమల డిమాండ్ చేసి ఉంటే బాగుండేదని’ పార్థసారధి అన్నారు. 

గాలి జనార్దన్‌రెడ్డి కంపెనీకి మొట్టమొదట లీజుకు ఇచ్చింది చంద్రబాబేనని పార్థసారధి గుర్తుచేశారు. జనార్దన్‌రెడ్డిని చంద్రబాబు సింగపూర్‌లో కలిసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. జనార్దన్‌రెడ్డినే కాదు.. చంద్రబాబుపై కూడా విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 

ఎవరినీ పట్టించుకోవడం లేదు
చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని పార్థసారధి విమర్శించారు. రైతులకు మద్ధతు ధర లేక అల్లాడుతుంటే సోమిరెడ్డి పట్టించుకోవడం లేదని.. అలాగే మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరుగుతుంటే హోంమంత్రి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర సమస్యలను వదిలిపెట్టి కర్ణాటక గురించి మాట్లాడటం సిగ్గుచేటని దుయ్యబట్టారు.

ధర్మపోరాటం పేరుతో బాబు దగా..
పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తామని మాట ఇచ్చిన చంద్రబాబు.. నాలుగేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు. ధర్మపోరాటం పేరుతో చంద్రబాబు దగా చేస్తున్నారన్నారు. బీజేపీ, టీడీపీ ఇద్దరు కలిసి చేసిన అన్యాయంపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రాజధానిలో ఇప్పటివరకూ ఒక్క శాశ్వత నిర్మాణం చేపట్టలేదని, మాయ మాటలు చెప్పి రైతుల భూములు బలవంతంగా లాక్కున్నారని మండిపడ్డారు. అభివృద్ధి చేయడం చేతకాక ప్రభుత్వం ప్రతిపక్షంపై నిందలు వేస్తున్నారని పార్థసారధి అన్నారు. 

మరిన్ని వార్తలు