‘ఓట్ల కోసమే ప్రజల వద్దకు’

4 Jan, 2019 02:43 IST|Sakshi

ఎన్నికల వేళ జనం కష్టాలు గుర్తొస్తున్నాయి 

చంద్రబాబుపై విజయసాయిరెడ్డి విసుర్లు 

పార్లమెంటు ఆవరణలో వైఎస్సార్‌సీపీ ఆందోళన 

ప్రత్యేక హోదా అమలు చేయాలని డిమాండ్‌

సాక్షి, న్యూఢిల్లీ: ఓట్ల కోసమే  చంద్రబాబు ప్రజల వద్దకొస్తారని, ఎన్నికలు దగ్గరికొస్తున్న వేళ వారు ఎదుర్కొంటున్న  సమస్యలు గుర్తుకొస్తున్నాయని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి విమర్శించారు. గురువారం రాజ్యసభ ప్రారంభానికి ముందు ఆయన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంటు ఆవరణంలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.‘రెండు రోజుల క్రితం చంద్రబాబు జన్మభూమి ఆరో విడత ప్రారంభించారు. నాలుగున్నరేళ్ల పాటు ప్రజల అవసరాలను గుర్తించలేదు. ఇప్పుడు మేల్కొని రేషన్‌ కారులిస్తామంటున్నారు. అంటే ఓట్ల కోసమే ఆయన ప్రజల వద్దకు వస్తారు. గెలిచాక ఇచ్చిన వాగ్దానాలు మరచిపోతారు. నాలుగున్నరేళ్లుగా అన్నం పెట్టకుండా ఎండగట్టారు. ఇప్పుడు వారి ఆకలి గుర్తుకొస్తోంది’ అని అన్నారు. అలాగే ‘అన్ని ప్రాజెక్టుల్లో విఫలమై కేవలం పబ్లిసిటీ కోసమే వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ప్రభుత్వ ఖర్చుతో ధర్మపోరాట సభలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఈరోజు మీడియాకు రూ. 2 వేల కోట్ల బకాయిలు పడ్డ పరిస్థితి.

రాజకీయ నాయకులు వేషాలు వేయొచ్చు. కానీ బ్యూరోక్రాట్లు ప్రజాధనాన్ని ముఖ్యమంత్రి ప్రచారం కోసం ఎలా వినియోగిస్తారు? ఇది చాలా తప్పు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై భవిష్యత్తులో చర్యలు తప్పవు’ అని హెచ్చరించారు. తాను పడిన కష్టానికి కూలిగా తనను మళ్లీ గెలిపించాలని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపైనా విజయసాయిరెడ్డి స్పందించారు. ‘ఏం కష్టపడ్డాడని.. ఆయనా.. ఆయన కుటుంబ సభ్యులు రూ. 4 లక్షల కోట్లు దోచుకున్నందుకు పడ్డ కష్టానికా కూలి ఇవ్వాలి.. అతడు చెప్పేవన్నీ అబద్దాలే. ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది’ అని విమర్శించారు. పవన్‌కల్యాణ్‌ తనతో కలిసి రావాలని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘గత రెండు మూడు రోజులుగా చంద్రబాబునాయుడు పవన్‌కల్యాణ్‌ వద్ద సరెండరై కాళ్లపై పడే పరిస్థితి. ఇదంతా ఒక అండర్‌ స్టాండింగ్‌ లాగానే జరుగుతోందని మా భావన. గతంలో మేం కేంద్రంలోని అధికార పార్టీకి దగ్గరవుతున్నామని ఆరోపిస్తూ రకరకాలుగా చంద్రబాబు మాట్లాడేవారు. ఇటీవలి చంద్రబాబు వ్యాఖ్యలను బట్టి.. లోకేశ్‌ను మనం కొణిదెల లోకేశ్‌ అని, చంద్రబాబుని దుర్మార్గుడు అని, పవన్‌ కల్యాణ్‌ను నారా పవన్‌నాయుడు అని పిలవొచ్చు. వీరి మధ్య ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ అండర్‌ స్టాండింగ్‌ ఉంది. నేనొక్కటే చెబుతున్నా.. నారా పవన్‌చంద్రరాహుల్‌నాయుడు అన్న విషయాన్ని ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు’ అని విజయసాయిరెడ్డి విమర్శించారు. 

ఏపీలో జాతీయ విద్యా సంస్థలకు రూ. 6,143 కోట్ల కేటాయింపు – రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు 
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి ఉన్నత విద్యాలయాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ. 6,143 కోట్లు  కేటాయించిందని  కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ సత్యపాల్‌సింగ్‌ గురువారం రాజ్యసభలో వెల్లడించారు. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వం నెలకొల్పిన ఉన్నత విద్యా సంస్థల నిర్మాణం కోసం చేసిన నిధుల కేటాయింపులపై విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. 

మరిన్ని వార్తలు