అవినీతి మరకలు చెరిపేస్తూ..

15 May, 2018 12:32 IST|Sakshi
కర్ణాటక బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్‌ యడ్యూరప్ప (ఫైల్‌ఫోటో)

సాక్షి, బెంగళూర్‌ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా బీఎస్‌ యడ్యూరప్ప ఆ పార్టీని విజయతీరాలకు చేర్చారు. అవినీతి మరకలున్నా స్టార్‌ క్యాంపెయినర్‌గా కర్ణాటకలో పార్టీకి ఘనవిజయం అందించడంతో పాటు 22వ రాష్ట్రంలో బీజేపీ సర్కార్‌ కొలువుతీరేందుకు మార్గం సుగమం చేశారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో తన అంచనాలు ఎప్పుడూ తప్పలేదన్న యడ్యూరప్ప​‍కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 125 నుంచి 130 సీట్లు దక్కుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ విస్పష్ట మెజారిటీ సాధిస్తుందని కావాలంటే రాసిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. అంతటితో ఆగని యడ్యూరప్ప మే 17న కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని కూడా యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుత ఫలితాలు యడ్యూరప్ప అంచనాలకు ఇంచుమించు అటుఇటుగానే ఉన్నాయి.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాని నరేం‍ద్ర మోదీ, పార్టీ చీఫ్‌ అమిత్‌ షాలతో పాటు యడ్యూరప్ప స్టార్‌ క్యాంపెయినర్‌గా వ్యవహరించారు. కాంగ్రెస్‌ను గద్దెదించాలని, కర్ణాటకకు సేవలందించేందుకు బీజేపీకి మరో అవకాశం ఇవ్వాలని 75 ఏళ్ల యడ్యూరప్ప ఓటర్లకు పిలుపు ఇచ్చారు. ఇక షికారిపుర నుంచి ఎన్నికల బరిలో దిగిన యడ్యూరప్ప అక్కడ ఏడవసారి ఘనవిజయం సాధించే దిశగా ఆధిక్యంలో దూసుకెళుతున్నారు.

2008లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా బీజేపీ దక్షిణాదిలో తొలి ప్రభుత్వ ఏర్పాటుకు యడ్యూరప్ప నేతృత్వం వహించారు. అయితే యడ్యూరప్పపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన పూర్తికాలం పదవిలో కొనసాగలేకపోయారు.  మైనింగ్‌ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలపై యడ్యూరప్ప బెంగళూర్‌ సెంట్రల్‌ జైలులో 20 రోజులకు పైగా జైలు జీవితం అనుభవించారు. ఇక పార్టీ హైకమాండ్‌ నుంచి సరైన మద్దతు కొరవడటంతో ఆగ్రహించిన యడ్యూరప్ప సొంత కుంపటి ఏర్పాటు చేసకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు యడ్యూరప్ప తిరిగి తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. యడ్యూరప్పపై అభియోగాలను అనంతరం హైకోర్టు కొట్టివేయడంతో బీజేపీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. 

మరిన్ని వార్తలు