యడ్డి రాజీనామా...తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు

19 May, 2018 17:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కర్ణాటక బలపరీక్షలో ఓటింగ్‌ జరగడానికి ముందే బీజేపీ ఓటమిని అంగీకరించింది. తమ దగ్గర 104 మంది ఎమ్మేల్యేలు మాత్రమే ఉన్నారని, అందుకే బలపరీక్షలో ఓడిపోయామని ముఖ్యమంత్రి యడ్యూరప్ప తెలిపారు. అనంతరం ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. యడ్యూరప్ప రాజీనామా చేయడంతో నూతన ముఖ్యమంత్రిగా జేడీఎస్‌ చీఫ్‌ కుమారస్వామి ప్రమాణస్వీకారం చేసేందుకు మార్గం సుగుమం అయింది. కుమారస్వామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా సమర్థిస్తూ కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు సంతకాలు సమర్పించిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్‌ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ప్రజాస్వామ్యమే గెలిచిందని, బీజేపీకి సరైన గుణపాఠం అని హర్షం వ్యక్తం చేశారు. గాంధీ భవన్‌ వద్ద బాణసంచి కాల్చి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్‌ నేతలు తమ అభిప్రాయలను వ్యక్తం చేశారు.

ఇది ప్రజాస్వామ్య విజయం...ప్రజాస్వామ్యాన్ని గెలిపించిన సుప్రీంకోర్టు, మీడియా వారికి ధన్యవాదాలు. నియంతలా వ్యవహరించిన బీజేపీకి సరైన బుద్ది వచ్చింది. 2019 లో జరిగే ఎన్నికలకు ఈ ఫలితాలు పునాది. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. - గీతారెడ్డి, పీఏసీ ఛైర్మెన్

ఇది ప్ర‌జాస్వామ్య విజ‌యం. - ర‌ఘువీరారెడ్డి ఏపీసీసీ చీఫ్‌.

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ చేసిన  ప్రయత్నాలు ఫలించాయి. యడ్యూరప్ప రాజీనామా కాంగ్రెస్ విజయం, ప్రజాస్వామ్య విజయం. ఎట్టకేలకు ప్రజాస్వామ్యమే గెలిచింది. 2019 నాటి ఎన్నికలకు ఇది పునాది. - ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్

కర్ణాటకలో ప్రజాస్వామ్యం గెలిచింది.15రోజులు అవకాశం ఇచ్చి ఉంటే గొర్లను కొన్నట్లుగా ఎమ్మెల్యేలను కొనేవారు.కర్ణాటక ఎమ్మెల్యేలు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. - వీహెచ్, కాంగ్రెస్ నేత

న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు. గవర్నర్ వ్యవస్థలో మార్పులు రావాలి. ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వస్తే సాధ్యాసాధ్యాలను గవర్నర్ పరిశీలించాలి.కర్ణాటక గవర్నర్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. బీజేపీ నియంతృత్వానికి వ్యతిరేకంగా లౌకిక శక్తులు ఏకం కావాలి. - మర్రి శశిధర్ రెడ్డి, కాంగ్రెస్ నేత

సుప్రీంకోర్టు లేకపోతే ప్రజాస్వామ్యం కూని అయ్యేది. సుప్రీమ్ న్యాయమూర్తులకు ధన్యవాదాలు. మోడీ అమిత్ షా విలువలకు తిలోదకాలు ఇస్తున్నారు. రాహుల్ గాంధీని ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ కు అధికారదాహం లేదు. అందుకే జేడీఎస్ కు మద్దతు ఇచ్చింది.కర్ణాటకలో బీజేపీకి పట్టిన గతి ఇక్కడ టీఆర్ఎస్‌కు పడుతుంది. - సర్వే సత్యనారాయణ

ప్రజాస్వామ్యం గెలిచి నిలిచింది. ప్రజాస్వామ్య పునాదులు పెకిలించే శక్తులకు అడ్డుకట్ట పడింది. గవర్నర్‌ను రీ కాల్ చేయాలి. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి చట్ట వ్యతిరేక పనులు చేస్తున్నారు. మా ఫోన్ లు ట్యాపింగ్ చేస్తున్నారు. దీని పై కూడా విచారణ జరిపించాలి. - పొన్నాల లక్ష్మయ్య

మరిన్ని వార్తలు