షాకిచ్చిన ప్రభుత్వం.. హుందాగా మాజీ సీఎం!

5 Jul, 2018 09:26 IST|Sakshi
బీఎస్‌ యడ్యూరప్ప (పాత చిత్రం)

సాక్షి, బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బీఎస్‌ యడ్యూరప్పకు హెచ్‌డీ కుమారస్వామి కూటమి ప్రభుత్వం షాకిచ్చింది. అయితే యెడ్డీ మాత్రం చాలా హుందాగా వ్యవహరించి తన గౌరవాన్ని  కాపాడుకున్నారని తెలుస్తోంది. సీఎంగా ఉన్న సమయంలో యడ్యూరప్ప రేస్‌కోర్స్‌ రోడ్డులోని నంబర్‌2 ఇంట్లో ఉండేవారు. అయితే కొన్ని రోజుల కిందట ప్రతిపక్షనేతగా తనకు ఆ ఇంటిని తిరిగి కేటాయించాలని కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తిచేశారు. కానీ కుమారస్వామి ప్రభుత్వం యెడ్డీకి అదే రోడ్డులోని నంబర్‌ 4 ఇంటిని కేటాయించింది.

బీజేపీ నేత అడిగిన ఇంట్లో ప్రస్తుతం మంత్రి మహేష్‌ ఉంటున్నారు. దీంతో యెడ్డీకి వేరే ఇంటిని ఇవ్వగా అందుకు ఆయన నిరాకరించారు. దీనిపై మాజీ సీఎం యడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ.. ‘మిత్రులారా.. నేను ఆ ఇంటిని కేటాయించాలని చాలాకాలం కిందటే కోరాను. కానీ నాకు అందుకు అవకాశం ఇవ్వలేదు. నా సొంత ఇంట్లోనే ఉంటాను. ప్రస్తుతం నాకు కేటాయించిన నంబర్‌ 4 ఇంటిని వేరే నేతకు కేటాయిస్తే ప్రయోజనం ఉంటుంది. దీనిపై ఇంతకంటే ఎక్కువ విషయాలు చెప్పదలుచుకోలేదు’ అని చెప్పారు. ప్రతిపక్షనేతగా తనను గౌరవం ఇచ్చేందుకైనా గతంలో ఉన్న ఇంటిని కర్ణాటక ప్రభుత్వం తనకు కేటాయిస్తుందని యడ్యూరప్ప ఎన్నో ఆశలు పెట్టుకున్నారని సమాచారం.

బంగ్లా కేటాయింపు వివాదంపై సీఎం కుమారస్వామి స్పందిస్తూ.. యడ్యూరప్పకు ఓ నివాసాన్ని కేటాయించాం. కచ్చితంగా ఆయన బంగ్లానే కేటాయించాలంటే కష్టం. చాలామంది మంత్రులు అదే ఇంటిని అడుగుతున్నారు. ఒకరికి ఆ ఇంటిని కేటాయించామని’ వివరించారు.

మరిన్ని వార్తలు