సమయం లేదు కుమార..

14 Jul, 2019 16:26 IST|Sakshi

బెంగళూర్‌ : కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సోమవారం విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని లేకుంటే తక్షణమే తప్పుకోవాలని బీజేపీ కర్ణాటక చీఫ్‌ బీఎస్‌ యడ్యూరప్ప స్పష్టం చేశారు. కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కార్‌కు అసెంబ్లీలో తగిన సంఖ్యాబలం లేదని అన్నారు. సంకీర్ణ సర్కార్‌కు చెందిన 15 మందికి పైగా జేడీఎస్‌-కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన క్రమంలో మెజారిటీ కోల్పోయిన ముఖ్యమంత్రి కుమారస్వామి సమయం వృధా చేయకుండా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

రాజీనామా చేసిన ఇద్దరు మంత్రులు గవర్నర్‌ను కలిసి తాము బీజేపీకి మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారని యడ్యూరప్ప గుర్తుచేశారు. కుమారస్వామి రేపు (సోమవారం) విశ్వాస పరీక్షను ఎదుర్కోవడమో, రాజీనామా చేయడమో తేల్చుకోవాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు రెబెల్‌ ఎమ్మెల్యేలను తిరిగి సంకీర్ణ గూటికి చేర్చేందుకు కాంగ్రెస్‌-జేడీఎస్‌ నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

మరిన్ని వార్తలు