బీజేపీలో చేరిన క్రీడాకారులు

26 Sep, 2019 19:11 IST|Sakshi

న్యూఢిల్లీ : ఒలంపిక్‌ పతక విజేత, స్టార్‌ రెజ్లర్‌ యోగేశ్వర్‌ దత్‌, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్‌ సందీప్‌ సింగ్‌ గురువారం బీజేపీలో చేరారు. హర్యానా బీజేపీ చీఫ్‌ సుభాశ్‌ బరాలా సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా యోగేశ్వర్‌ దత్‌ మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీ తననెంతో ప్రభావితం చేశారని.. ఆయన స్ఫూర్తితో రాజకీయాల్లో ప్రవేశించానని పేర్కొన్నారు. ‘ ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతో బీజేపీలో చేరాను. ప్రధాని మోదీ పాలన నన్నెంతగానో ప్రభావితం చేసింది. క్రీడాకారులు కూడా ప్రజా సేవలో భాగస్వామ్యం కావాల్సిన ఆవశ్యకతను చాటిచెప్పింది. ఈ కుటుంబం(బీజేపీ)లో సభ్యుడిని కావడం చాలా సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నాడు. 

కాగా హర్యానా ఎన్నికలు సమీపిస్తున్న వేళ యోగేశ్వర్‌ దత్‌, సందీప్‌ సింగ్‌ బీజేపీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున వీరిద్దరు బరిలోకి దిగే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక 2012 ఒలంపిక్‌ క్రీడల్లో భారత్‌కు కాంస్య పతకం అందించిన యోగేశ్వర్‌ దత్‌ను సోనెపట్‌ నియోజకవర్గం నుంచి పోటీలో దింపాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో యోగేశ్వర్‌ ఇప్పటికే తన పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇక సందీప్‌ సింగ్‌తో పాటు శిరోమణి అకాలీ దళ్‌ ఎమ్మెల్యే బాల్‌కౌర్‌ సింగ్‌ కూడా గురువారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సందీప్‌ సింగ్‌ మాట్లాడుతూ...ప్రధాని మోదీ, హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌లను ఆదర్శంగా తీసుకుని పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. జాతికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో కాషాయ కండువా కప్పుకొన్నానని తెలిపారు. 

మరిన్ని వార్తలు