యోగి ‘రాముడి’కథ ఎవరికి నచ్చలేదు

11 Dec, 2018 14:59 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క మిజోరం మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ విస్తృతంగా ప్రచారం సాగించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆయన ఏకంగా 74 ఎన్నికల సభల్లో ప్రసంగించారు. ప్రతి చోటు ఆయన రాముడిని ప్రస్థావించి ఓ చోటుకు రాముడికి ఉన్న సంబంధాన్ని అనుబంధాన్ని వివరించడంతోపాటు బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి రాష్ట్రంలో ప్రజలందరిని సమానంగా చూసే రామరాజ్యం తీసుకొస్తామని ఆయన చెప్పారు. టెర్రరిస్టులకు మాత్రం బిర్యానీ తినిపించమని, బుల్లెట్లు తినిపిస్తామని చెప్పారు.

ఆదిత్యనాథ్‌ చత్తీస్‌గఢ్‌ వెళ్లినప్పుడు అది రాముడి తల్లిగారి ఊరని చెప్పారు. తెలంగాణ వచ్చినప్పుడు రాముడు వనవాసం సమయంలో దండకారణ్యంలో తిరిగాడని చెప్పారు. మధ్యప్రదేశ్‌ వెళ్లినప్పుడు రాముడిని సవాల్‌ చేసిన పరుశరాముడి ప్రాంతమని తెలిపారు. రాజస్థాన్‌ వెళ్లినప్పుడు అది రాముడి కుడిభుజమైన బజరంగ్‌ బాలి ప్రాంతమని ఆలిని ఓడించడానికి ఆయన ఒక్కడు చాలని వ్యాఖ్యానించారు. ముస్లింల పక్షపాతంటూ కాంగ్రెస్‌ను ఆయన ఆలితో పోల్చారు.

రాజస్థాన్‌లోని నాగౌర్‌లో యోగి మాట్లాడుతూ 2006లో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ చేసిన ప్రసంగాన్ని వక్రీకరించి దేశ వనరులు మొట్టమొదట చెందాల్సిందీ ముస్లింలకని మన్మోహన్‌ చెప్పారని, మరప్పుడు హిందువులు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. మొదటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ విభజించు పాలించి రాజకీయాలకు పాల్పడుతున్నారని, అందుకే దేశంలో టెర్రరిస్టులు తయారవుతున్నారని, టెర్రరిస్టులకేమో బిర్యానీ తినిపిస్తున్నారని విమర్శించారు. వాస్తవానికి 2006లో ప్రధాని మన్మోహన్‌ మాట్లాడుతూ దేశంలోని ఎస్సీ, ఎస్టీలను, మైనారిటీ మతస్థులను, ముఖ్యంగా ముస్లింలను వెనకబడిన వారిగా గుర్తించామని, వారి అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

అదిత్యయోగే కాకుండా సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 31 సభల్లో, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా 56 చోట్ల ప్రసంగించినా లాభం లేకపోయింది. ఒక్క మధ్యప్రదేశ్‌లోనే బీజేపీ రాణించగలిగింది. మిగతా అన్ని రాష్ట్రాల్లో పరాజయాన్ని మూటకట్టుకుంది.

మరిన్ని వార్తలు