‘కరీంనగర్‌ పేరును కరిపురంగా మారుస్తాం’

5 Dec, 2018 14:48 IST|Sakshi

కరీంనగర్‌ బహిరంగ సభలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌

సాక్షి, కరీంనగర్‌ : కరీంనగర్‌ నియోజకవర్గ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కోరారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కరీంనగర్‌లో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో యోగి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ... బీజేపీ తప్ప ఇక్కడున్న మిగతా పార్టీలన్నీ నిజాం ప్రభువులను పొగిడేందుకే పరిమితమయ్యాయని మండిపడ్డారు. టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు సమాజాన్ని విభజించు - పాలించు అనే సూత్రం ఆధారంగా పని చేస్తాయని విమర్శించారు. ఆ పార్టీలు తమ మేనిఫెస్టోలో ముస్లింలకు ప్రత్యేక తాయిలాలు ప్రకటిస్తాయే తప్ప నిజంగా వారి సంక్షేమం కోసం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టవని దుయ్యబట్టారు.

టీఆర్‌ఎస్‌ కుటుంబ పార్టీ...
రాష్ట్రంలో నక్సలిజాన్ని అరికట్టడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని యోగి అన్నారు. టీఆర్‌ఎస్‌ సహా ఇక్కడున్న పార్టీలన్నీ కుటుంబ పార్టీలేనని విమర్శించారు. బీజేపీ మాత్రం ఇటువంటి విధానాలకు విరుద్దమని, ఆ పార్టీలో ఎవరైనా పదవులు పొందవచ్చని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌ రావులే ఇందుకు నిదర్శనమన్నారు. బీజేపీని గెలిపిస్తే కరీంనగర్‌ పేరును కరిపురంగా మారుస్తామని యోగి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు