సొంత నియోజకవర్గంపై సీఎం దృష్టి

21 May, 2018 17:40 IST|Sakshi
యోగి ఆదిత్యనాథ్‌ (ఫైల్‌ ఫొటో)

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తన సొంత నియోజకవర్గం గోరఖ్‌పూర్‌పై దృష్టి సారించారు. గత మార్చిలో గోరఖ్‌పూర్‌ లోక్‌సభా స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ కూటమి అధికార బీజేపీని ఓడించిన విషయం తెలిసిందే. గోరఖ్‌పూర్‌ నుంచి ఆదిత్యనాథ్‌ ఐదుసార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. యూపీ సీఎంగా యోగి ఎన్నిక కావడంతో ఖాళీ అయిన గోరఖ్‌పూర్‌లో ఎస్పీ-బీఎస్సీ కూటమి విజయం సాధించి బీజేపీకి షాక్‌ ఇచ్చింది. 2019 ఎన్నికల్లో ఎలాగైనా గోరఖ్‌పూర్‌ స్థానాన్ని నిలబెట్టుకోవాలని యోగి పట్టుదలతో ఉన్నారు.

గడిచిన రెండు నెలల్లో పదిసార్లు గోరఖ్‌పూర్‌లో పర్యటించారు. పర్యటన సందర్భంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. దానిలో భాగంగా ఎయిమ్స్‌, వాటర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్సు లాంటి ప్రాజెక్టులను సీఎం ప్రారంభించారు. పర్యటన అనంతరం గోరఖ్‌పూర్‌లో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై స్థానిక ఎమ్మెల్యేలు, నేతలతో యోగి చర్చించారు. బీజేపీకి కంచుకోటగా పేరున్న గోరఖ్‌పూర్‌లో అధికార పార్టీ ఓడిపోవడం కమలనాథులకు మింగుడుపడటం లేదు.

రానున్న ఎన్నికల్లో ఎలాగైనా సొంత స్థానాన్ని నిలబెట్టుకోవాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇక గోరఖ్‌పూర్‌, పుల్‌పూర్‌ ఉప ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న ఎస్పీ-బీఎస్పీ కూటమి రానున్న ఎన్నికల్లో అదే వ్యూహాన్ని అమలుచేసి, అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తామన్న ధీమాతో ఉంది.

>
మరిన్ని వార్తలు