రావణాసుర, దుర్యోధన అని పేరెందుకు పెట్టరు?

5 Nov, 2018 09:16 IST|Sakshi

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ నగరం అలహాబాద్‌ పేరును ప్రయాగ్ రాజ్‌గా మార్చడాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ సమర్థించుకున్నారు. తన నిర్ణయాన్ని పౌరాణిక పాత్రలైన రావణాసుర, దుర్యోధునులతో పోలుస్తూ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఆదివారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘అలహాబాద్‌ పేరును ఎందుకు మార్చారని కొంత మంది నన్ను ప్రశ్నిస్తున్నారు. వారందరనీ ఒకటి అడుతుతున్న.. మీ తల్లిదండ్రులు మీకు రావాణాసుర, దుర్యోధన అని ఎందుకు పేర్లు పెట్టడం లేదు? ఇది కూడా అలాగే. ఎవరైనా మంచి పేర్లను పెడుతారు’ అని యోగి పేర్కొన్నారు.

అలహాబాద్‌ అసలు పేరు ‘ప్రయాగ్‌’. కానీ 16 శతాబ్దంలో మొగల్‌ చక్రవర్తి అక్బర్‌.. గంగా, యమున నదుల సమీపంలో ఓ కోటను స్థాపించి దాని పేరు సంగం అని పెట్టారు. అలాగే ప్రయాగ్‌ ప్రాంతం, సంగం ప్రాంతాల మొత్తాన్ని ఇలహాబాద్‌గా నామకరణం చేశారు. తర్వాత అక్బర్‌ మనువడు షాజహాన్‌ దాన్ని అలహాబాద్‌గా నామకరణం చేశారు. (అయోధ్య’పై త్వరలో శుభవార్త)

కాగా ఇటీవల అలహాబాద్‌ పేరును ప్రయాగ్ రాజ్‌గా యోగి ఆదిత్యానాథ్‌ సర్కార్ తీర్మానం చేసింది. ‘బ్రహ్మదేవుడు మొదట యజ్ఞం చేసిన ప్రదేశం ప్రయాగ్‌. రెండు నదులు కలిసే చోట ఇది ఉంది. అలాగే అలహాబాద్‌లో గంగా, యమునా, సరస్వతీ మూడు నదులు కలుస్తాయి. అందుకే దాన్ని కింగ్‌ ఆఫ్‌ ప్రయాగ్‌ అంటారు. ఈ కారణంతోనే అలహాబాద్‌కు ‘ప్రయాగ్‌ రాజ్‌’ పేరును ఖరారు చేశామ’ని సీఎం యోగి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

కాగా యోగి సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఒక రాజకీయ జిమ్మిక్కు అని, బలవంతంగా హిందూత్వ ఎజెండాను ప్రజలపై రుద్దుతున్నారని ప్రతిపక్ష ఎస్పీ, కాంగ్రెస్‌ పార్టీలు మండిపడ్డాయి. మరోవైపు మేధావులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీజేపీ ఇలాంటి జిమ్మిక్కులకు పాల్పడుతోందని విమర్శలు వస్తున్నాయి.

అయోధ్యలో రాముని భారీ విగ్రహం!

మరిన్ని వార్తలు