‘వారు బిర్యాని తినిపిస్తే.. మేం తూటాలు తినిపించాం’

26 Nov, 2018 18:19 IST|Sakshi

జైపూర్‌ : కాంగ్రెస్‌ ఉగ్రవాదులకు బిర్యానీ పెట్టి పోషించింది కాబట్టే దేశంలో 26/11 దాడులు జరిగాయంటూ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ మండిపడ్డారు. రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మక్రానాలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న యోగి.. కాంగ్రెస్‌ పార్టీ మీద విమర్శల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ విభజన రాజకీయాలు చేస్తోంది. అందువల్లే దేశంలో ఉగ్రవాదం పెరిగిపోయిందని ఆరోపించారు. ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీ ఉగ్రవాదులకు బిర్యాని పెట్టి పోషిస్తే.. నేడు తాము అదే ఉగ్రవాదుల చేత తూటాలు తినిపించామని యోగి తెలిపారు.

ముంబైలో 26/11 మరణహోమం జరిగి నేటికి పదేళ్లు పూర్తయ్యాయి. పలు ముఖ్యమైన ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో దాదాపు 175 మంది మరణించారు. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల్లో అజ్మల్‌ కసబ్‌ ఒక్కడే పోలీసులకు ప్రాణాలతో పట్టుబడ్డాడు. ఈ కేసు విచారణ సందర్భంగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఉజ్వాల్‌ నికామ్‌, ముంబై జైళ్లో ఉన్నప్పుడు కసబ్‌ ప్రతిరోజు బిర్యాని కావాలని అడిగినట్లు పేర్కొన్నాడు. దాంతో అప్పట్లో ఈ విషయంపై పెద్ద వివాదమే చేలరేగింది. దాంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఉజ్వాల్‌ వివరణ ఇస్తూ కసబ్‌కు అనుకూలంగా ఏర్పడిన సానుకూల వాతావరణాన్ని విచ్ఛిన్నం చేసేందుకు గాను తాను ఇలాంటి వ్యాఖ్యలు చేశానని వెల్లడించారు. అంతేకాక ప్రభుత్వం కసబ్‌కు ఎప్పుడు బిర్యానీని అందించలేదని కూడా వివరించారు. ముంబై 26/11 కేసులో దోషిగా నిర్ధారించబడిన కసబ్‌ను 2012 నవంబర్‌లో ఉరి తీశారు.

మరిన్ని వార్తలు