మత మార్పిడికి వచ్చిన ‘ఇటలీ ఏజెంట్లు’

16 Nov, 2018 03:14 IST|Sakshi

సోనియా గాంధీపై యోగి వివాదాస్పద వ్యాఖ్యలు

జాష్‌పూర్‌: కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ చేసిన పరోక్ష వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇటలీ నుంచి వచ్చిన ఏజెంట్లు గిరిజనులను మత మార్పిడులకు ప్రోత్సహించారన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని జాష్‌పూర్‌లో గురువారం ప్రచార సభలో ఆదిత్యనాథ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఇటలీ ఏజెంట్లు’ అని పరోక్షంగా సోనియా గాంధీ మూలాల్ని ప్రస్తావించారు. ‘ఇటలీ ఏజెంట్లు..గిరిజనులు మతమార్పిడులకు పాల్పడాలని ఒత్తిడి పెంచి జాతి వ్యతిరేక కార్యకలాపాలకు ఒడిగట్టారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సమయంలో రోడ్లు, విద్య, విద్యుత్‌ వంటి సౌకర్యాలు లేకున్నా మతమార్పిడుల జాడ్యం మరింత ఎక్కువైంది. దివంగత బీజేపీ ఎంపీ దిలీప్‌సింగ్‌ జుదేవ్‌ ఈ సమస్యను ధైర్యంగా ఎదుర్కొని జాష్‌పూర్‌ మరో బస్తర్‌ కాకుండా అడ్డుకున్నారు. కరుస్తుందని తెలిసినా హిందువులు పాముకు పాలు పోస్తారు. త్యాగాల్ని విశ్వసించే హిందూ మతం ప్రపంచంలోనే చాలా అత్యంత గొప్పది. ఇతరుల మాదిరిగా బలవంతపు మతమార్పిడులను హిందువులు నమ్మరు. ఛత్తీస్‌గఢ్‌లో రామరాజ్యం నెలకొల్పే ప్రభుత్వం రావాలి’ అని యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు.

వలసదారులు వెనక్కే: షా
లోక్‌సభ ఎన్నికల తరువాత దేశవ్యాప్తంగా అక్రమ వలసదారుల్ని గుర్తించి వెనక్కి పంపిస్తామని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లో ప్రచార సభలో మాట్లా డుతూ 1971 నుంచి భారత్‌లోకి చొరబడిన వలసదారులు కాంగ్రెస్, తృణమూల్‌ లాంటి పార్టీలకు ఓటుబ్యాంకుగా మారారన్నారు.

మరిన్ని వార్తలు