త్వరలోనే కూటమి సాకారం

31 Dec, 2018 04:44 IST|Sakshi
అఖిలేశ్‌ యాదవ్‌

ఎస్పీ–బీఎస్పీ పొత్తుపై అఖిలేశ్‌ యాదవ్‌ వ్యాఖ్య

యూపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ– బహుజన్‌ సమాజ్‌ పార్టీల మధ్య పొత్తుపై వస్తున్న వార్తలపై ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ స్పందించారు. పొత్తుపై చర్చలు ప్రారంభమవుతాయని త్వరలోనే కూటమి ప్రజల ముందు ఉంటుందని ఆయన తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీ –బీఎస్పీలు కలసి పనిచేయడంతో బీజేపీ ఓటమి పాలైంది. దీంతో ఈ రెండు పార్టీలు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కూడా కలిసే పోటీచేయాలని భావిస్తున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య పొత్తుకు సంబంధించి త్వరలోనే చర్చలుంటాయని అఖిలేశ్‌ తెలిపారు. ఈ కూటమిలో కాంగ్రెస్‌ ఉంటుందా అన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం చెప్పలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫెడరల్‌ ఫ్రంట్‌ కోసం చేస్తున్న ప్రయత్నాలను అఖిలేశ్‌ మెచ్చుకున్నారు.

అందుకే  ఎన్‌కౌంటర్‌ ఎత్తుగడలు
ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు బదిలీలు తప్పించుకునేందుకే ఎన్‌కౌంటర్‌ ఎత్తుగడలను అనుసరిస్తున్నారని అఖిలేశ్‌ అన్నారు. యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేరస్తులు రెట్టింపయ్యారని, శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. గతంలో ఎన్నడూ ఇలా లేదన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఎన్‌కౌంటర్లను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఆయన ప్రోత్సాహంతోనే పోలీసు ఉన్నతాధికారులు బదిలీల అంశంలో లబ్ది పొందుతున్నారన్నారు. వచ్చే ఏడాది దేశం మరో కొత్త ప్రధానిని చూస్తుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరిగిపోయాయన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉంది బీజేపీకాదని, ఆరెస్సెస్‌ ప్రభుత్వమని మండిపడ్డారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని అఖిలేశ్‌ విమర్శించారు.

మరిన్ని వార్తలు