మీకు అధికారంలో ఉండే హక్కులేదు - సుప్రీం ఫైర్‌

6 Nov, 2019 19:00 IST|Sakshi

పెరుగుతున్న కాలుష్య స్థాయిలపై మండిపడిన  సుప్రీంకోర్టు

సిగ్గనిపించడంలేదా అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఫైర్‌

తక్షణమే చర్యలు చేపట్టండి 

భవంతుల్లో కూర్చున్నమీకు పేద ప్రజలు చచ్చిపోతున్నా పట్టదా?

దేశాన్ని 100 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్తారా!

సాక్షి,  న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రజలను వణికిస్తున్న తీవ్ర వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తీవ్రమైన వాయు కాలు​ష్య ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలోని కోట్లాది మంది ప్రజల జీవితాలు, వారి రక్షణ పట్టదా అని సుప్రీం బుధవారం మండిపడింది. సంక్షేమ ప్రభుత్వం అనే భావన మీరు (రాష్ట్రాలు) మర్చిపోయారా? పేద ప్రజల గురించి బాధపడటం లేదు, ఇది చాలా దురదృష్టకరమని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్‌ దీపక్‌ దీపక్ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.  అంతేకాదు ప్రజల గురించి పట్టించు​కోనివారికి అధికారంలో ఉండే హక్కు లేదు వ్యాఖ్యానించింది. 

"కాలుష్యం కారణంగా ప్రజలు ఇలా చనిపోవడానికి మీరు అనుమతించగలరా? దేశాన్ని100 సంవత్సరాల వెనక్కి వెళ్ళడానికి మీరు అనుమతించగలరా" అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పంట వ్యర్థాలను దహనం చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.  ప్రభుత్వాల నిర్లక్ష్యానికి రైతులను బాధ్యుల్ని చేయడం భావ్యం కాదని తెలిపింది.  ఇది కోట్లాదిమంది ప్రజల జీవన‍్మరణ సమస్య. ఇందుకు ప్రభుత్వాలు బాధ్యత వహించాలి" అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

పంట వ్యర్థాలను కొనుగోలు చేసేందుకు, వాటిని ఉపయోగించుకునేందుకు తమ వద్ద యంత్రాంగం, నిధులు లేవని, రాష్ట్రం ఇప్పటికే అప్పుల్లో ఉందని పంజాబ్ చీఫ్ సెక్రటరీ సుప్రీంకోర్టుకు నివేదించడంతో..మరోసారి మండిపడిన జస్టిస్ మిశ్రా..మీ వద్ద నిధులు లేకపోతే..మేమే మీకు నిధులు అందజేస్తామని, కేంద్రంపై ఆధారపడటం మాను కోవాలని, మీరు ఏమీ చేయలేకపోతే..ఆ విషయాన్ని కోర్టులకు వదిలేయాలని స్పష్టం చేశారు. 

విమానాల దారి మళ్లింపు, ప్రజలు తమ నివాసాల్లో కూడా సురక్షితంగా ఉండకపోవడంపై మీకు సిగ్గు అనిపించడం లేదా? అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు భవంతుల్లో (ఐవరీ టవర్స్‌) కూర్చుంటే సరిపోతుందా..?కోట్లాది ప్రాణాలకు సంబంధించిన విషయంపైనా సరైన విధంగా స్పందించరా? అని అత్యున్నత  న్యాయస్థానం ప్రశ్నించింది. మీరు భవంతుల్లో కూర్చుని ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదనుకుంటే.. మీ ప్రాణాలు కూడా పోయే పరిస్థితి వస్తుంది.. మీ ప్రాణాలు పోకుండా ఉండాలంటే మీరు ఏదో ఒకటి చేయాలని ప్రభుత్వాధినేతలకు  స్పష్టం చేసింది. ఈ విషయంలో తక్షణ చర్యలను ఆశిస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. 
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా