సింహపురి సిగలో యువకెరటాలు

9 Jun, 2019 10:42 IST|Sakshi
మేకపాటి గౌతమ్‌రెడ్డి, అనిల్‌ కుమార్‌ యాదవ్‌

జిల్లాలో మొదటిసారిగా మంత్రులైన యువ ఎమ్మెల్యేలు

జిల్లా నుంచి మూడో నీటిపారుదలశాఖ మంత్రిగా అనిల్‌కుమార్‌యాదవ్‌

మొదటి పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా మేకపాటి గౌతమ్‌రెడ్డి

రాజకీయ ఉద్దండులకు నెలవైన సింహపురిలో నవ యువ మంత్రుల శకం ప్రారంభమైంది. జిల్లా నుంచి మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్, ఉపరాష్ట్రపతిగా అనేక మంది అగ్రనేతలు పనిచేశారు. అయితే ఒకే పర్యాయం, ఒకే కేబినెట్‌లో ఇద్దరు యువ మంత్రులకు చోటు దక్కడం జిల్లా రాజకీయ చరిత్రలో ఇదే ప్రథమం. బెజవాడ గోపాల్‌రెడ్డి మొదలుకొని గత కేబినెట్‌లో మంత్రులుగా పనిచేసిన సోమిరెడ్డి, నారాయణ వరకు అందరూ సీనియర్‌లే. వయసు రీత్యా కూడా పెద్దవారే. మొదటి సారి యువ ఎమ్మెల్యేలను, అందులోనూ రెండోసారి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్‌లో చోటు దక్కడం జిల్లా రాజకీయ చరిత్రలో చర్చనీయాంశంగా మారింది. 

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: విధేయతకు పట్టం కడుతూ అనుభవంతో నిమిత్తం లేకుండా నిత్యం తన వెంటే ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు మేకపాటి గౌతమ్‌రెడ్డి, డాక్టర్‌ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్‌లకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో చోటు లభించింది. అలాగే సామాజిక సమీకరణల దృష్ట్యా కూడా జిల్లాలో రెడ్డి వర్గానికి చెందిన ఒక వ్యక్తికి మంత్రిగా ఇవ్వడం గతం నుంచి ఆనవాయితీగా వస్తోంది. దీనినే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొనసాగించి మేకపాటి కుటుంబ రాజకీయ వారసుడు గౌతమ్‌రెడ్డిని మంత్రిని చేశారు. ఇక జిల్లా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా బీసీ నేతగా ఉన్న అనిల్‌కుమార్‌యాదవ్‌ను మొదటిసారి మంత్రి చేశారు. తద్వారా జిల్లాలో సరికొత్త చరిత్ర సృష్టించారు.
 
కొత్త చరిత్ర 
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ నూరు శాతం స్థానాలను నాలుగు జిల్లాల్లో దక్కించుకున్న విషయం తెలిసిందే. వాటిలో నెల్లూరు జిల్లా ఒకటి అయితే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందిన నేతలు ఎక్కువ మంది రికార్డు మెజార్టీలు సాధించి వైఎస్సార్‌సీపీ పట్టును, జగన్‌పై ఉన్న విశ్వాసాన్ని చాటారు. జిల్లాలో ఐదుగురు ఎమ్మెల్యేలుగా రికార్డు మెజార్టీలు సాధించారు. ఆయా నియోజకవర్గాల ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఎవరూ సాధించని మెజార్టీలు సాధించి కొత్త చరిత్ర సృష్టించారు. ఇక జిల్లాలో 1957 తర్వాత బెజవాడ గోపాలరెడ్డి, ఏసీ సుబ్బారెడ్డిలు మొదట మంత్రులుగా పనిచేశారు. నాటి నుంచి అవిభక్త నెల్లూరు జిల్లాలో కందకూరు నుంచి గెలుపొందిన చెంచు రామానాయుడు, అలాగే ప్రస్తుత నెల్లూరు జిల్లా నుంచి గెలుపొందిన ఆనం సంజీవరెడ్డి, ఆనం వెంకటరెడ్డి, నేదురుమల్లి జనార్దనరెడ్డి, నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కలికి యానాదిరెడ్డి, మాదాల జానకిరామ్, ఆళ్లపాక రమేష్‌రెడ్డి, బల్లి దుర్గాప్రసాద్, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పరసా రత్నం, నేదురుమల్లి రాజ్యలక్ష్మి, పొంగూరు నారాయణ తదితరులు జిల్లా నుంచి ఇప్పటివరకు మంత్రులుగా పనిచేశారు.

వీరిలో రెండో పర్యాయం, మూడో పర్యాయం కూడా మంత్రులుగా పనిచేసిన వారు అనేక మంది ఉన్నారు. అలాగే జిల్లా నుంచి నేదురుమల్లి జనార్దనరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే ప్రస్తుత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు జిల్లాలోని ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా రాజకీయ ప్రస్థానం కొనసాగించారు. రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లాకు రాజకీయంగా ఖ్యాతి ఉంది. ప్రతి కేబినెట్‌లో కనీసం ఒక్క కీలక శాఖ అయినా జిల్లాకు దక్కేది. 1957 తర్వాత నుంచి జిల్లాలోని ఎమ్మెల్యేలు ఇప్పటివరకు 17 మంది మంత్రులుగా పనిచేశారు. 18, 19వ మంత్రులుగా మేకపాటి గౌతమ్‌రెడ్డి, డాక్టర్‌ పోలబోయిన అనిల్‌కుమార్‌యాదవ్‌లు గుర్తింపు పొందారు.

మూడో ఇరిగేషన్‌ మంత్రిగా అనిల్‌ 
జిల్లాలో అనిల్‌కుమార్‌యాదవ్‌ కన్నా ముందు ఇద్దరు నీటిపారుదలశాఖ మంత్రులుగా పనిచేశారు. మొదటగా ఏసీ సుబ్బారెడ్డి 1956 నుంచి 1962 మధ్య కాలంలో ముఖ్యమంత్రులు నీలం సంజీవరెడ్డి, దామోదర సంజీవయ్యల హయాంలో రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రిగా చేశారు. ఆ తర్వాత 1983–85 మధ్య నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఎన్టీఆర్‌ కేబినెట్‌లో నీటిపారుదలశాఖ మంత్రిగా చేశారు. ఆ తర్వాత మూడో మంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేబినెట్‌లో నెల్లూరు సిటీ నుంచి గెలుపొందిన పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ నీటిపారుదలశాఖ మంత్రి అయ్యారు.

జిల్లాకు ఐటీ శాఖ ప్రథమం
జిల్లా నుంచి గతంలో ఎవరూ ఐటీ శాఖ మంత్రిగా చేసిన నేతలు లేరు. అలాగే పరిశ్రమలు, వాణిజ్య శాఖలను గతంలో జిల్లాకు చెందిన నేతలు ఎవరూ నిర్వహించలేదు. మొదటిసారిగా ప్రభుత్వ ప్రాధాన్య కీలక శాఖలైన పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ తదితర శాఖల మేకపాటి గౌతమ్‌రెడ్డి నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తలు